Minister Jupally Fires on Excise Officials : తెలంగాణ ఆబ్కారీ శాఖలో కొందరు అధికారులు స్వతహాగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుండడంపై ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరును తప్పుబట్టారు. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయమై ఎందుకు తన దృష్టికి తీసుకురాలేదని నిలదీశారు. ప్రభుత్వం దృష్టికి రాకుండా ఏ అధికారంతో నిర్ణయాలు తీసుకున్నారని అధికారులపై మండిపడ్డారు.
Minister Jupally Issued Orders : ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకున్నఅధికారులపై విచారణ జరిపి, రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్‌ను మంత్రి జూపల్లి ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ''బీరు'' కొత్త బ్రాండ్లు తెరపైకి వచ్చాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షంతోపాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. భారీ ఎత్తున ముడుపులు తీసుకుని కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారన్న విమర్శలు సైతం వచ్చాయి.
కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని బెవరేజ్ కార్పొరేషన్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాలేదు. దీంతో తన దృష్టికి రాకుండా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్న విశ్వాసంతో మీడియా ముందుకు వచ్చి తాము అనుమతులు ఇవ్వలేదని మంత్రి చెప్పారు. ఆ మరుసటి రోజున అనుమతులకు సంబంధించిన వివరాలు మీడియాలో రావడంతో తీవ్ర వివాదస్పదమైంది.
Commissioner Explained About New Brands : ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. తాము ఐదు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో మొదటి నుంచి ప్రతిపక్షం, సామాజిక మాధ్యమాలు ప్రసారం చేసిన వార్తలు నిజం కావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వ్యవహారం మంత్రికి తెలియకుండానే అధికారులు కానిచ్చేయడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చినట్లయ్యింది.
బెవరెజ్ కార్పొరేషన్‌పై మంత్రి సమీక్ష : దీంతో మంగళవారం బెవరేజ్ కార్పోరేషన్ అధికారులతో సమావేశమైన మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మద్యం కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో అధికారులు స్వంత నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు చెడ్డపేరు తెచ్చేట్లుగా అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. బెవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు చెడ్డపేరు వచ్చిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
స్వంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్న : కీలకమైన బాధ్యతల్లో ఉన్న అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తనకు తెలియకుండా, తన దృష్టికి రాకుండా అధికారులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారని కూడా నిలదీశారు. స్వంత నిర్ణయాలతో ప్రభుత్వానికి ఇబ్బంది, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం : అంతకు ముందు నాంపల్లి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దాదాపు 5 గంటపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. బెవరేజ్ కార్పొరేషన్లో జరుగుతున్న వ్యవహారాలతోపాటు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వస్తున్న ఆదాయం, గుడంబా, కల్లు కల్తీ, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సరఫరా, మాదక ద్రవ్యాల సరఫరా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తాజా పరిస్థితులను మంత్రికి వివరించిన అధికారులు : రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌తోపాటు అదనపు కమిషనర్ అజయ్‌రావు, ఇతర జాయింట్ కమిషనర్లు మంత్రికి వివరించారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం సరఫరా, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి తయారీ, సరఫరా, అమ్మకాలు జరగకుండా రాష్ట్రంలో కొనసాగుతున్న నిఘాతోపాటు రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాల పనితీరుపై సమీక్షలు నిర్వహించి నిఘాను మరింత పటిష్టం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో ఈవెంట్లు చేసే వారికి ప్రభుత్వం సహకరిస్తుంది : మంత్రి జూపల్లి
తప్పు చేసిన వారే భయపడతారు - కేసీఆర్‌లో దడ మొదలైంది : మంత్రి జూపల్లి