EVMs Shifting To Strong Rooms : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 17 ఎంపీ స్థానాల్లోని అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు తీర్పునిచ్చారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించిన అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 48.5 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. గతంతో పోలిస్తే 6శాతం ఓటింగ్ పెరిగిందన్న అనుదీప్ రానున్న ఎన్నికల్లో మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఓట్లు డిలీట్ అయ్యాయన్న ఆరోపణలను ఖండించిన కలెక్టర్ పద్ధతి ప్రకారమే ఓట్లు తొలగించామని తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు : రంగారెడ్డి జిల్లా చెవేళ్ల నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలను గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో భద్రపరిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పోలింగ్ శాతం గతం కంటే పెరిగినట్లు అధికారులు తెలిపారు. మెదక్ స్థానానికి 44మంది, జహీరాబాద్‌కు 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల సామగ్రిని నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ కళాశాలల, గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు.
EVMs To Strong Rooms After Lok Sabha Polling : కరీంనగర్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోని ఈవీఎంలను జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా ఎస్ఆర్ కళాశాలకు తరలించారు. పెద్దపల్లి పరిధిలో ఉపయోగించిన ఎన్నికల సామగ్రిని మంథనిలోని జేఎన్టీయూ కళాశాలతో పాటు మంచిర్యాలలోని మరో కళాశాలకు తరలించారు.పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఈవీఎంలను పరిశీలించారు.
నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. గోదాముల వద్దనున్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. భువనగిరి నియోజకవర్గంలో వినియోగించిన ఈవీఎంలను అరోరా ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈవీఎంలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏడంచెల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా చివరి దశ ముగిసిన అనంతరం జూన్ 4న అభ్యర్థులు భవితవ్యం తేలనుంది.
" గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో 6శాతం ఓటింగ్ పెరిగింది.ఈవీఎంలను, ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూంలో ఉంచి సీజ్ చేసాము. ప్రతి కంట్రోల్ రూంలో మూడెంచెల భద్రత ఉంటుంది. సీఆర్ఎఫ్ బలగాలు, ఆర్మ్డ్ పోలీసు బలగాలు, స్టేట్ పోలీసులు ఉంటారు. జూన్ 4న ఒట్ల లెక్కింపు రోజున రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల మధ్య ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లకు సీళ్లు తీస్తాము." -అనుదీప్, హైదరాబాద్ కలెక్టర్
'EVMలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ'- 'ఇప్పటి వరకు 40 సార్లు ఇలా!' - SC EVMs Verdict