Everything in the State is Pledged to Debt By Jagan : సంపద సృష్టి తెలియదు, ఉన్న రాబడి చాలదు, వనరులను పెంచి వాటి నుంచి ఆదాయం తెచ్చే నైపుణ్యం లేదు అలాంటివారు ఏం చేస్తారు? అప్పులు ఇచ్చే వారికోసం దిక్కులు చూస్తారు. మరి ఆదాయం లేనివారికి రుణం ఎవరు ఇస్తారు? ఇవ్వరు కాబట్టి అలాంటివారు ఏదో ఒకటి తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌ది అదే దుస్థితి. రాష్ట్రంలో పరిపాలన సాగించడానికి అప్పులపైనే జగన్ ప్రధానంగా ఆధారపడ్డారు. తన ఐదేళ్ల పాలనాకాలంలో రుణం కోసం తోచిందల్లా తాకట్టు పెట్టేశారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలను బ్యాంకులకు కుదువబెట్టి రుణాలు తీసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌నే తాకట్టు పెట్టారు. ‘కార్పొరేషన్లకు మీరు ఇచ్చే అప్పుల కోసం నేను గ్యారంటీ ఉంటాను’ అంటూ ఏకంగా సర్కారే జీవోలను జారీ చేసిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి జంకిన బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ‘మాకొద్దు మీ గ్యారంటీ భూములో, మరొకటో తాకట్టు పెట్టండి’ అని ముఖం మీదే చెప్పేశాయి. చేసేదేమీ లేక జగన్ సర్కారు ఇష్టారీతిన ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. చివరికి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిని కూడా ఇప్పుడే కుదువ పెట్టేసింది. ఇంతకంటే దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రమేదైనా ఉంటుందా? భవిష్యత్తులో వచ్చే రాబడిని తాకట్టు పెట్టడం నిబంధనలకు విరుద్ధం. జాదూ జగన్ చట్టాలు, నిబంధనలకు బలాదూర్ కదా? అందుకే అందినవి అందినట్టు తాకట్టు పెట్టి రూ.వేల కోట్ల రుణం తీసుకున్నారు. అలా తెచ్చిన రుణాన్ని ఆస్తులు సృష్టించే, ఆదాయం సాధించే, రాబడి పెంపొందించే మార్గాలపై వెచ్చించారా అంటే అదీ లేదు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వని ఖర్చులు చేశారు. ఈ పరిస్థితుల్లో తాకట్టు తాలూకు అప్పులు తీరేదెలా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వేచ్ఛావాయువులను పీల్చేదెప్పుడు?
కార్పొరేషన్లతో ఇష్టారాజ్యం: రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా ఆ సంవత్సరం ఎంత ఉత్పత్తి ఉంటుందో అంచనా వేసి అందులో 3.5 శాతం మేర అప్పులు తీసుకునేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు ఇస్తుంది. ఆ పరిమితి దాటి అప్పులు చేయకూడదు. జగన్ సర్కారు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. అప్పులు తీసుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ‘రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్’ను ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ సర్కారు రూ.25 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు ఎత్తుగడ వేసింది. మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. అలా వచ్చే మొత్తంలో కొన్ని మద్యం డిపోల ఆదాయం ప్రతినెలా ఖజానాకు వచ్చి అక్కడి నుంచి కార్పొరేషన్‌కు మళ్లించేలా పథకం పన్నింది. తనకు వచ్చే ఆదాయం నుంచి కార్పొరేషన్ అప్పు తీరుస్తుందని పేర్కొని రూ.25 వేల కోట్లు కావాలని అడిగింది. పైగా ఆ అప్పు తీర్చేందుకు తాను గ్యారంటీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు కూడా ఇచ్చింది. ఇంత చేసినా బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు భయపడ్డాయి. దీంతో విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. వాటి మార్కెట్ విలువ రూ.2,954,03,10,800గా పేర్కొంది. విశాఖ నగరంలోని 13 ఆస్తులకు చెందిన 128.70 ఎకరాలను ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీకి తనఖా పెట్టింది. ఈ ప్రభుత్వ భూములను రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించారు.
పర్యాటక శాఖ పార్కు: విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన ఐదెకరాల్లో విస్తరించి ఉన్న టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పార్కును కూడా జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టేసింది. ఆహ్లాదకరమైన బెర్ము పార్కును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.143 కోట్ల రుణం తీసుకుంది. రోజూ వందల మంది పర్యాటకులు లాంచీల్లో ఆ పార్కును సందర్శించి సేద తీరుతుంటారు. ఇందులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో హోటల్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
టిడ్కో ఇళ్లు: వైఎస్సార్సీపీ సర్కారు ఏది దొరికితే దాన్ని తాకట్టు పెట్టేసిందని అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల నివాసానికి నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా కుదువబెట్టి రుణం తీసుకుంది. గృహాల నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 260 ఎకరాల భూములను కేటాయించింది. ఆ స్థలాలు, ఇళ్లను తాకట్టు పెట్టి హడ్కో నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకుంది.
సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు భావోద్వేగ ట్వీట్
పోర్టు భూములు: కాకినాడ జిల్లాలోని పోర్టు భూములను తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడ లేదు ఘనత వహించిన జగన్ సర్కారు. పోర్టుల అభివృద్ధి పేరిట ఎస్‌బీఐ క్యాప్‌నకు ఈ భూములను అప్పగించేసింది. కాకినాడలో అప్పటివరకు నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను ఆ పరిధి నుంచి తొలగించారు. ఇలా కాకినాడ నగరం, గ్రామీణ మండలాల పరిధిలోని 337.83 ఎకరాలను కుదువబెట్టి రూ.1,500 కోట్ల అప్పు పుట్టించింది. ఈ స్థలాలను ఏపీ మారిటైం బోర్డు పేరిట బదలాయించి వారితో తనఖా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. కాకినాడలో మొత్తం 1,926.57 ఎకరాల్లో పోర్టు భూములు ఉన్నాయని తేల్చారు. ఇందులో ఇప్పటికే 337.83 ఎకరాలను తాకట్టు పెట్టగా మరికొన్ని భూములను కూడా కుదువబెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
భవిష్యత్తు ఆదాయాలు సైతం: ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడంలో ఆరితేరిన జగన్ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిని కూడా వదలలేదు. రాష్ట్రంలో మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించి కొన్ని మద్యం డిపోలకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు మళ్లించారు. ఆ ఆదాయాన్ని గ్యారంటీగా చూపి రూ.23,500 కోట్లను అప్పుగా సమీకరించారు. మద్యంపై ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది. ఆ మొత్తాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ వివిధ మద్యం బ్రాండ్లపై సుంకం విధించి వసూలు చేసుకునే అధికారం కల్పించింది. బ్యాంకులకు ఈ రాబడి చూపి ఇప్పుడే అప్పు తీసుకున్నారు. రాబోయే సంవత్సరాల్లో వచ్చే రాబడిని అప్పులు తీర్చడానికి తాకట్టు పెట్టినట్లే లెక్క. ఈ విధానాన్ని రిజర్వు బ్యాంకు తప్పు పట్టినా దాన్ని పట్టించుకోకుండా అప్పు తీసుకున్న ఘనత జగన్‌కే దక్కింది!