Telangana Formation Day 2024 : ఎందరో అమరుల బలిదానాల మీద ఏర్పడ్డ గడ్డ తెలంగాణ. ఈ రాష్ట్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో సంవత్సరాలు సొంత రాష్ట్రం కోసం త్యాగాలు, పోరాటాలు చేస్తే, చివరకు ఎందరో బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం పోరాటాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది పోరాటం చేశారు.
దాని ఫలితంగా 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా, ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు ఆనాటి పోరాటాల ఘటనలను ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం ఇలా అనేక స్మృతులు పెనవేసుకున్న భాగ్యనగరం దశాబ్ది వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆనాటి ఘటనలను మరోసారి గుర్తు చేసుకుందాం.
ప్రజల్లో నమ్మకాన్ని పెంచిన మిలియన్ మార్చ్ : ఈజిప్టు దేశంలోని కైరో పట్టణంలో తెహ్రిక్ చౌక్ వద్ద రాజుకు వ్యతిరేకంగా 10 లక్షల మంది మిలియన్ మార్చ్ నిర్వహించారు. దాన్నే స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ వాసులు, హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని 2011 మార్చి 10వ తేదీన నిర్వహించారు. అప్పుడే ఇంటర్ పరీక్షలు జరుగుతుండటంతో మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేశారు. 144 సెక్షన్ విధించినా లెక్కచేయకుండా సొంత రాష్ట్రం కోసం అశేష జనవాహిని చేరుకుని మార్చ్‌ను విజయవంతం చేశారు. ఆ సంఘటన ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందన్న నమ్మకాన్ని పెంచింది.
Telangana Formation Day 2023 : నీళ్లు,నిధులు, నియామకాలు కోసమే పోరాటం.. నాటి ఉద్యమ ఫలాలు నేడు యువతకు
రాజకీయ జేఏసీ 2012 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్ నిర్వహించింది. అనంతరం దీని పేరును సాగరహారంగా మార్చారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగవని, జేఏసీ లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ప్రభుత్వం అనుమతించింది. వేదికను ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్ రోడ్డుకు మార్చుకోవాలని సూచించింది.
అలా ప్రభుత్వ అనుమతితో గన్‌పార్క్ స్థూపం, ఇందిరా పార్క్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఇలా అనేక చోట్ల నుంచి ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. నెక్లెస్ రోడ్డులో సాగరహారానికి పోలీసులు ఎన్ని నిర్భంధాలు విధించినా బారికేడ్లు, ఇనుప కంచెలను తెంచుకుని తెలంగాణ ఉద్యమకారులు లక్షలాదిగా తరలివచ్చారు. రాత్రి 7 గంటలు దాటినా ఎవ్వరూ అక్కడి నుంచి కదలకపోవడంతో ఉద్యమకారులపై పోలీసులు భాష్ప వాయువులను ప్రయోగించారు.
మైలురాయిగా నిలిచిన సకల జనుల సమ్మె : సొంత రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ వాసులందరూ భాగస్వాములయ్యారు. ప్రజల ఆకాంక్షలు ప్రస్ఫుటించేలా 2011 సెప్టెంబర్ 13న శ్రీకారం చుట్టిన సకల జనుల సమ్మె, మలిదళ ఉద్యమంలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సమ్మెలో రాజధాని పరిధిలోని లక్షలాది మంది ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బడిపిల్లలు సైతం రాష్ట్ర సాధన కోసం రోడ్డెక్కారు. ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంలా మారింది. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. 42 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగిందంటే రాష్ట్రం కావాలన్న ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Telangana Decade Celebrations : పదేళ్ల ప్రగతిని చాటేలా.. అమరుల త్యాగాలను స్మరించుకునేలా..
Telangana Decade celebrations 2023 : దశదిశలా దద్దరిల్లేలా 'తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు'