Negligence in Intermediate Exam Evaluation 2024 : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులను చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే వారి అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబుపత్రాల పునఃపరిశీలన తర్వాత మార్కులను చూసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా? ఎంత నిర్లక్ష్యమా? అంటూ ఇంటర్ బోర్డుకు క్యూ కడుతున్నారు.
Complaints to Telangana Intermediate Board : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 100కి 98, 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు సెకండియర్‌లో వచ్చిన మార్కులను చూసి హతాశులవుతున్నారు. సరిగ్గా జవాబులను పరిశీలించకుండానే తమకు ఎంత తోస్తే అన్ని మార్కులు వేయడం, మొత్తం మార్కుల కూడికలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత సుమారు 48,000ల మంది పునఃపరిశీలనకు, మరో 2,000ల మంది పునఃలెక్కింపునకు అర్జీ చేసుకున్నారు.
Errors in Inter Exam Evaluations 2024 : పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తాము రాసిన జవాబుపత్రాలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇంటర్‌బోర్డు తీరుపైనా మండిపడుతున్నారు. కొన్ని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు ఇంటర్‌లో అధిక మార్కులు పొందిన వారికి బీటెక్, ఇతర కోర్సుల్లో ఫీజు లేకుండా సీట్లు ఇస్తున్నారు. మరికొన్ని విశ్వవిద్యాలయాలు కనీస మార్కుల నిబంధన విధిస్తున్నాయి. మూల్యాంకనంలో జరుగుతున్న దారుణాలతో వారు నష్టపోతున్నారు. దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి జవాబుపత్రాలను నిపుణులకు చూపించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇంటర్‌బోర్డు తప్పిదాలూ కారణమే : కొన్ని కార్పొరేట్, పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పేపర్ల మూల్యాంకనానికి ట్యూటర్లను, జూనియర్ లెక్చరర్స్‌ను పంపుతున్నాయి. వారు మిడిమిడి జ్ఞానంతో మార్కులు వేస్తున్నారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నా, ఇంటర్‌బోర్డు తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. 2019లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనంపై ఫోకస్ పెట్టడం లేదు. మార్కులు తేడా వస్తే జరిమానా వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అధ్యాపకులు తప్పు చేసినప్పుడు కళాశాలల యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలని, అసలు వారివద్ద పనిచేస్తున్న అధ్యాపకుల జాబితా తీసుకొని ఏటా అందులో కొంత శాతం మంది తప్పకుండా మూల్యాంకనానికి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.
- ఎంపీసీ విద్యార్థి ఒకరికి లాంగ్వేజ్‌లో 21 మార్కులు వచ్చాయి. దీనిపై రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, పరిశీలనలో ఏకంగా 91 మార్కులు దక్కాయి. ఆ జవాబుపత్రాన్ని పరిశీలించిన ఇంటర్‌బోర్డు అధికారులు, మూల్యాంకనం జరిగిన విధానాన్ని చూసి తలలు పట్టుకున్నారు.
- హైదరాబాద్‌కు చెందిన ఎంఈసీ విద్యార్థిని ఎస్.సంహితకు మొత్తం 926 మార్కులు వచ్చాయి. తొలి సంవత్సరం కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్‌లో 100కి 98 రాగా, కానీ సెకండియర్‌లో 77 మాత్రమే వచ్చాయి. వాస్తవానికి ఆ సబ్జెక్టులో ఆమె వేసుకున్న లెక్క ప్రకారం కనీసం 95 మార్కులు రావాలి. ఈ విద్యార్థిని పునఃపరిశీలనకు అర్జీ చేసుకోగా, మార్కుల్లో ఎటువంటి మార్పు లేదని ఇంటర్‌బోర్డు సమాచారం ఇచ్చింది. అనంతరం జవాబుపత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి విద్యార్థిని సంహిత డౌన్‌లోడ్ చేసుకుంది. అధ్యాపకుడు తొలుత 97 మార్కులు వేసి, తర్వాత దాన్ని 77గా మార్చినట్లు పేపర్లను చూస్తే స్పష్టం అవుతోంది. పలు ప్రశ్నలకు మొదట ఇచ్చిన మార్కుల్ని కూడా దిద్దినట్లు ఓఎంఆర్ షీట్‌లో కనిపిస్తోంది. ఈ విద్యార్థిని మార్కుల విషయమై నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డులోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
- పలువురు విద్యార్థులు ప్రశ్నలకు సరైన జవాబులు రాసినా, సున్నా మార్కులు వేశారు. జనగామకు చెందిన స్వాతి అనే విద్యార్థిని 984 మార్కులు సాధించింది. సెకండియర్ రసాయనశాస్త్రంలో మొదట 57 మార్కులు వేయగా, పునఃపరిశీలనలో 59 వచ్చాయి. రెండు మార్కుల ప్రశ్నకు సున్నా మార్కులు వేశారు. పరిశీలన అనంతరం దాన్ని సరిదిద్దారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇలాంటి బాధిత విద్యార్థులు వందల మంది ఉన్నారు.
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు - TS Inter Supplementary Exam 2024