Enumerators Problems with People In Survey in Telangana : రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో పాల్గొంటున్న ఎన్యుమరేటర్లకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పట్టణాల్లో సర్వే ఒకరకంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరోరకంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 కుటుంబాలు కేటాయించినా సర్వే సమయంలో వాటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఉదాహరణకు ఒక కుటుంబంలోని వివరాలు ఒకే ఫాంలో నమోదు చేస్తుంటే పెళ్లిళ్లు అయిన కుమారులు వేరుగా వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకు ఉంటున్నవారు సైతం వివరాలు రాయించుకోవడంతో కుటుంబాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఎన్యుమరేటర్లు అంటున్నారు.
- సమగ్ర కుటుంబ సర్వే సాఫీగా సాగుతోందని, ప్రజలు కుటుంబ వివరాలన్నీ చెబుతున్నారని కొత్తగూడెంలోని ఓ ఎన్యుమరేటర్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఒకట్రెండు కుటుంబాలు మాత్రమే తమకు సర్వే అవసరం లేదని అన్నారని చెప్పారు. దాదాపు 90 శాతం కుటుంబాలు తమ ఆస్తుల వివరాలు మాత్రం చెప్పటం లేదని వివరించారు.
- పట్టణాల్లో సర్వే ఇబ్బందిగా ఉంటోందని, తమ వివరాలు చెప్పేందుకు కొన్ని కుటుంబాలు నిరాకరిస్తున్నాయని సత్తుపల్లిలో ఓ ఎన్యుమరేటర్ తెలిపారు. సర్వేకు సహకరించినా అన్ని ప్రశ్నలకు వివరాలివ్వటం లేదని చెప్పారు. ఆస్తుల విషయంలో అయితే అవి మీకెందుకు అనే సమాధానమే ఎదురవుతోందని పేర్కొన్నారు. కొంతమంది అయితే సర్వే ఎందుకు ? మా వివరాలు మీకెందుకు అంటూ ప్రశ్నలతోనే సమయం వృథా చేస్తున్నారని తెలిపారు.
- గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సర్వే సాఫీగా సాగటానికి ముందస్తు సమాచారం ఉపయోగపడుతోందని ఖమ్మంలోని పినపాక మండలం మద్దులగూడెం ఎన్యుమరేటర్ సాంబశివరావు చెప్పారు. ఒకరోజు ముందే ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో ఆయా కుటుంబాల్లో ఒకరిద్దరు ఎలాంటి పనులకు వెళ్లకుండా ఇళ్ల వద్ద ఉండి వివరాలు చెబుతున్నారని తెలిపారు. గ్రామీణ వాసులు మాత్రం వారి ఆస్తులు, అప్పుల వివరాలను నిస్సంకోచంగా తెలియజేస్తున్నారని వెల్లడించారు.
సర్వే ముఖ్యాంశాలు కొన్ని
★ సర్వే పూర్తిచేయటానికి ఒక్కో ఇంట్లో దాదాపు 35 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది.
★ సర్వేలో భాగంగా ఆస్తుల చిట్టా విప్పేందుకు ఇబ్బంది పడుతున్నవారు, అప్పులు వివరాలు మాత్రం టక్కున చెబతుండటం గమనార్హం
★ ద్విచక్రవాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, టీవీలున్నా కొందరు లేవని సమాధానాలు చెబుతున్నారు. కొంతమంది అయితే ఆ వివరాలను దాటివేస్తున్నారు.
★ సొంత ఊర్లోనే వివరాలు ఇస్తామంటూ కొందరు సర్వేను దాటవేస్తున్నారు. కొంతమంది వారు ఉంటున్న చోటే వివరాలు నమోదు చేయించుకుంటున్నారు.
★ ప్రజాప్రతినిధులందరూ తమ ఆస్తులు, అప్పుల సర్వేలో చెబుతున్నారా ? మరి సామాన్యులే ఎందుకు ఆస్తులు వివరాలు చెప్పాలంటూ కొందరు సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లను ప్రశ్నిస్తున్నారు.
★ తమకు సర్వే అవసరం లేదంటూ చెప్పేవాళ్లు ఎక్కువగా పట్టణాల్లోనే ఉంటున్నారు. ఇలాంటి వారి పేర్లను నమోదు చేసుకుంటున్న ఎన్యుమరేటర్లు వారితో సంతకం తీసుకుంటున్నారు.
'అవన్నీ అప్పులు చేసి కొన్నాం - వాటి గురించి మీకెందుకు?' : ఎన్యూమరేటర్లకు ఎదురుప్రశ్నలు
ఇంటికి వెళితే ఉండరు - ఆస్తి వివరాలు అడిగితే చెప్పరు - ఎన్యూమరేటర్లకు తప్పని సర్వే అష్టకష్టాలు