Engineering Counselling started in Telangana : తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ సంవత్సరం బీటెక్ సీట్లు తగ్గాయి. సోమవారం (ఇవాళ) నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానుండగా, కన్వీనర్ కోటా సీట్లు 70,307 మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఈసారి 173 ఉండగా, వాటిల్లో మొత్తం సీట్లు 98,296. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లలో 70 శాతాన్ని కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆ ప్రకారం 70,307 సీట్లకు విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చు.
గత ఏడాది (2023-24) తొలి విడత కౌన్సెలింగ్‌లో, 173 కళాశాలల్లో 1,07,039 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటా కింద 76,359 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి విడత పూర్తయిన అనంతరం ప్రత్యేక విడత నాటికి సీట్లు పెరిగాయి. ఆ ప్రకారం మొత్తం సీట్లు 1,16,720 అవగా, అందులో కన్వీనర్ కోటా సీట్లు 85,671. అంటే నిరుడు కంటే ఈసారి సీట్లు తగ్గాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే రెండు, మూడు విడతల కౌన్సెలింగ్ నాటికి సీట్లు మళ్లీ చాలా వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
సీట్లు తగ్గడానికి కారణాలు: డిమాండ్ లేని కోర్సులను ఈసారి మూసివేసుకొని వాటి స్థానంలో సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీల్లో సీట్లను పెంచుకునేందుకు ఆయా కళాశాలలు ఏఐసీటీఈ నుంచి అనుమతి ఇచ్చింది. అందువల్ల దాదాపు 8 వేల సీట్లపై ప్రభావం పడింది. పలు కళాశాలలు సీఎస్‌ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), సైబర్ సెక్యూరిటీ లాంటి బ్రాంచ్లను కూడా మూసివేసి సీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకొని (కన్వర్షన్) అనుమతి తీసుకున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఇంకా వాటికి అనుమతి ఇవ్వలేదు.
ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నందున ఆయన అనుమతి ఇస్తే తప్ప, వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చరు. రెండో విడత నాటికైనా అనుమతి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు ఏఐసీటీఈ నిబంధనలను అనుసరించి పలు కళాశాలలు పెద్ద సంఖ్యలో అదనపు సీట్లకు అనుమతి పొందాయి. అవి దాదాపు 20,500 వరకు ఉన్నాయి. వాటికి సర్కారు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నేది తెలియాల్సి ఉంది.
కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్ : రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సికింద్రాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ మధ్య కాలంలోనే నూతన కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆమె ఆదివారం కూడా దాదాపు రెండు గంటలపాటు ఉండి కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి ఏమైనా సమస్యలపై ఆరా తీశారు. ఆమెతో పాటుగా క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.