TGEAPCET Second Phase Counselling Seat Allotment : ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86,509 ఇంజినీరింగ్ సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండగా రెండు రౌండ్లలో కలిపి 81,490 సీట్ల కేటాయింపు పూర్తైంది. మరో 5,019 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఈఏపీసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ పేర్కొన్నారు.
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ విద్యా సంస్థలు ఉండగా, అందులో 94.20 శాతం సీట్ల కేటాయింపు రెండో రౌండ్‌కు పూర్తైనట్టు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్ సమయానికి రాష్ట్రంలో 78,694 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండగా, ఆ తర్వాత సర్కారు మరో 10వేల సీట్లకు అనుమతినిచ్చింది. దీంతో అదనంగా 7,024 కన్వీనర్ కోటా సీట్లు రెండో రౌండ్‌కు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు గతంలో సీట్లు పొందిన వారు సైతం రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.
TG EAPCET Counselling 2024 : మరోవైపు తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారిలో 22,848 మంది స్లైడింగ్ ఆప్షన్‌ను వినియోగించుకున్నట్టు కన్వీనర్ పేర్కొన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నప్పటికీ 9,084 మంది సీట్లు దక్కించుకోలేకపోయారని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత మాత్రమే స్వయంగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఈఏపీసెట్ విద్యాశాఖ సూచించింది.
ఇంతకుముందు ప్రకటించినట్లుగా రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత రిపోర్ట్ చేయవద్దని ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో వారు చివరి విడతకు పోటీపడొచ్చని స్పష్టమైంది. మరో వైపు ఇప్పటివరకు బీ కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ప్రకటన ఇవ్వలేదు.
ఈ పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాలకు ధ్రువపత్రాలు అప్పగించిన తర్వాత టాప్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు లభిస్తే అప్పుడు సర్టిఫికేట్లను వెనక్కి తీసుకోవడం కష్టమవుతుంది. యాజమాన్యాలు అంత తొందరగా వాటిని ఇచ్చేందుకు అంగీకరించవు. సీటు ఖాళీ అవుతున్నందున సంవత్సరం ఫీజు అయినా చెల్లించమంటారు. ఇలాంటి అనుభవాలు ఇంతకుముందు ఎన్నో ఉన్నందున చివరి విడత సీట్ల కేటాయింపు తర్వాతే ధ్రువపత్రాలను ఆయా కాలేజీల్లో అప్పగించేలా నిర్ణయాన్ని మార్చినట్లు తెలుస్తోంది.