Encounter In Mulugu District : భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లో తాడ్వాయి మండలంలోని దామరతోగు అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ ఫైరింగ్ జరిగింది. పోలీసుల ఎన్కౌంటర్లో మావోయిస్టు అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని బుద్ధారం వాసి.
ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా మావోల లేఖ : దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ ఓ లేఖను విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని సంరక్షిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై మావోయిస్టు పార్టీ నిర్మూలనకై కాగర్ దాడిని తీవ్రతరం చేస్తున్నారన్నారు. అందుకే నిరంతరం పోలీసులతో అడవులను జల్లెడ పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజలకోసం పనిచేస్తున్న విప్లవకారులను హత్య చేస్తుందని ఆజాద్ విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతోగు అటవీ ప్రాంతంలో గురువారం 6 గంటల సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తున్నామని అజాద్ లేఖలో పేర్కొన్నారు. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. విద్యార్థులు మేధావులు, ప్రజాస్వామికవాదులు ఈ ఎన్‌కౌంటర్‌ను నిరసించాలని పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు వెంకటాపూర్, వాజేడు మండలాల రహదారి వెంబడి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Maoist Encounter In TG- Chhattisgarh border : కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగింది. వడ్డిపేట-పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా గ్రే హౌండ్స్ బృందం, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోలు మృతిచెందారు. మృతుల్లో ఒకరు ఐవోఎస్ కమాండర్ రాజేశ్‌గా పోలీసులు గుర్తించారు.
Maoists Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
maoist bandh in telangana: మావోయిస్టుల బంద్.. ఏజెన్సీల్లో టెన్షన్.. టెన్షన్..!