Encamped Visakha Railway Station Moderization Works: అమృత్ భారత్ పథకంలో భాగంగా విశాఖ రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులకు గ్రహణం పట్టుకుంది. రూ.456 కోట్ల వ్యయంతో 20 లిప్టులు, 20 ఎస్కలేటర్లు, రెండు వైపులా మల్టీ లెవల్ కారు పార్కింగ్‌లు, రెండు ఆధునిక పాదాచారుల వంతెనలు, 9, 10 ప్లాట్‌ఫామ్‌లతో పాటు జ్ఞానాపురం వైపు ఒక సరికొత్త నమూనాతో విశాఖ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్టేషన్ పనులు అనుకున్నట్లే జరిగితే 2025 చివరి నాటికి ఈ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు అమలు ప్రశ్నార్థకంగా మారింది.
పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO
పనులు ప్రారంభమైనప్పటి నుంచి 36 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. సంవత్సరన్నర దాటినా స్టేషన్ అభివృద్ది పనులు ఇంకా కొలిక్కి రాకపోవడం గమనార్హం. మార్గనిర్దేశాల మేరకు పనులు పూర్తి చేయడం లేదనే కారణంతో రైల్వే అధికారులు గుత్తేదారుని తొలగించారు. దాదాపు ఆరు నెలలుగా స్టేషన్ గురించి పట్టించుకున్న నాథులే లేకపోవడంతో పనులు చేపట్టిన ప్రాంతం పిచ్చిమొక్కలు, మురుగు నీరుతో దర్శనమిస్తోంది. ఆధునికీకరణ కోసం గతంలో పూర్తిగా మూసేసిన జ్ఞానాపురం గేట్‌ను తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇప్పట్లో పనులు మొదలయ్యే అవకాశం లేనట్లు సంకేతాలు తెలుస్తున్నాయి.
విశాఖ స్టేషన్‌లో జ్ఞానాపురంవైపు గతంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అక్కడి మట్టి తీవ్ర అంతరాయం కలిగించింది. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గుత్తేదారులను ఎంపిక చేయాల్సిన రైల్వే అధికారులు ఆ దిశగా ఆలోచన చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. గుత్తేదారు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఏడాదిన్నర దాటినా తిరిగి టెండరు పిలిచి వేరొకరికి అప్పగించడానికి రైల్వే అధికారులు మల్లగుల్లాలు పడుతుండడం విశేషం. ప్రారంభ సమయంలో మట్టి తవ్వకాలు చేపట్టినప్పడు పెద్ద బండరాళ్లు అడ్డు తగలడంతోపాటు అక్కడి మట్టి సైతం భవనాల నిర్మాణానికి అనుకూలంగా లేదనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో ప్రాజెక్టును చేపట్టడానికి కొత్త సంస్థలేవి ముందుకు రావడం లేదని చెబుతున్నారు.
ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్ ఇతర అధికారులతో సమావేశమై ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనిపై రైల్వే అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. అయితే అడ్డంకుల గురించి ప్రస్తావించకపోవడంతో ఫలితంగా ప్రాజెక్టు నిలిచిపోయింది. పనుల ప్రారంభానికి ముందు నేల సామర్థ్య పరీక్షలు చేశారా? చేస్తే ఆయా పరీక్షల్లో ఏమి తేలింది? టెండరును మరో గుత్తేదారులకు అప్పగించడంలో జాప్యానికి కారణాలను వాల్తేర్ అధికారులు చెప్పాల్సి ఉండగా అది తమ పరిధిలో లేదనే అంశంగా భావిస్తుండడంపై విమర్శలొస్తున్నాయి.
మర్రిపాలెం స్టేషన్ అభివృద్ధితో సత్ఫలితాలు: విశాఖ స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టడం ఆలస్యమైతే మర్రిపాలెం స్టేషన్ వైపు దృష్టి సారించాలని రైల్వే రంగ నిపుణులు సూచించారు. దీన్ని శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేసి ఆరు ప్లాట్‌ఫామ్‌లు నిర్మిస్తే విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లను మర్రిపాలెం స్టేషన్ నుంచి నడిపేలా చర్యలు తీసుకోవచ్చు. దాంతో విశాఖ స్టేషన్‌పై భారం తగ్గుతుంది. ఫలితంగా దువ్వాడ మీదుగా వెళ్లే పలు ప్రత్యేక రైళ్లను విశాఖ స్టేషన్‌కు తీసుకురావచ్చు. తద్వారా విజయవాడ, తిరుపతి, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు అందుబాటులోకి వచ్చి ఇక్కడి ప్రయాణికుల వెతలు తీరుతాయి.