Eenadu Employees Tribute to Ramojirao : అక్షర యోధుడు, దివంగత రామోజీరావుకు, రామోజీగ్రూపు ఉద్యోగులు నివాళులు అర్పించారు. దశదిన సంస్కారాలు పురస్కరించుకుని హైదరాబాద్ సోమాజిగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళులు, పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు అడ్వటైజ్‌మెంట్ విభాగం హెడ్ ఐ.వెంకట్, ఈనాడు, ఈటీవీ సీనియర్ పాత్రికేయులు, హైదరాబాద్ బ్యూరో, సిటీ పాత్రికేయులు, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, ప్రియా ఉద్యోగులు, మానవవనరులు, అడ్వటైజ్‌మెంట్, సర్క్యులేషన్, కెమెరా, సెక్యూరిటీ వంటి వివిధ విభాగాల సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు.
అక్షరంతో కలిసి నడిచి, అక్షరంతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిన ఆ "అక్షర యోగి" లేరన్న వార్తను జీర్ణించుకోవటం కష్టమే అయినప్పటికీ, కాలంతో పాటే సాగే క్రమంలో ఇలాంటి వాటన్నింటినీ దాటుకుని పెద్దాయన ఆశించిన, అప్పగించిన బాధ్యతల కోసం ముందు సాగుతామని జర్నలిస్టులు, ఉద్యోగులు తెలిపారు. సంస్థ నిర్థేశించిన బాధ్యతలు తప్పకుండా నిర్వర్తించడం ద్వారా రామోజీరావు ఆశయాలు ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు.