Employees Agitations in Andhra Pradesh: ఉద్యోగ ,ఉపాధ్యాయ ,పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఏపీఎన్జీవో సంఘం పశ్చిమ కృష్ణా శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంతో 11 సార్లు చర్చలు జరిపినా ఫలితం లేదని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్చలు జరిపిన ప్రతిసారీ గడువు కోరుతూ ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్నారు. లేదంటే ఫిబ్రవరి 27వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. గతంలో కంటే భారీగా 27వ తేదీన నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.
సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు- ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తిన రాష్ట్రం
సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు ఏళ్ల పది నెలలు కావస్తున్నా, ఉద్యోగులకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఏపీ జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం పేరిట వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం 21 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
సిద్ధమని ప్రచారం చేసుకుంటున్న సీఎం జగన్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించకుండా ఉండేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. పెండింగ్ డీఏలు చెల్లించకుండా ఉండేందుకు సిద్ధమా అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు సైతం సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
సమస్యలపై స్పందించకపోతే 27న 'చలో విజయవాడ': ప్రభుత్వ ఉద్యోగులు
కర్నూలులో జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి ఉద్యోగ జేఏసీ నేత హృదయరాజు డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కడపలో మహావీర్ కూడలి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఉద్యోగులు కలెక్టరేట్‌లోనికి వెళ్లకుండా ముళ్లకంచెతో పాటు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదని నేతలు విమర్శించారు.
నెల్లూరులో ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తదనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఎన్జీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎన్జీవో సంఘ నేత ఈశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని కోరితే విధుల నుంచి తొలగిస్తారా? : గురుకుల ఉద్యోగులు
శ్రీకాకుళంలో ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి జ్యోతిబా పూలే పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 27న విజయవాడను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా జేేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మహా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఉద్యోగ సిబ్బంది నినాదాలు చేశారు. నాలుగేళ్లగా సమస్యలపై పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మండిపడ్డారు.
'మా సమస్యలను పరిష్కరించాలి' - విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన