Justice PC Ghose Inquiry on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విధానపరమైన అంశాలపై దృష్టి సారించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన విధానపర నిర్ణయాలు, అమలు తీరు, నిర్మాణం, సంబంధిత అంశాలపై అప్పటి అధికారుల నుంచి కమిషన్ వివరాలు సేకరిస్తోంది.
అందులో భాగంగా గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, నీటిపారుదల, ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించిన అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేస్తున్నారు. ఇవాళ కమిషన్ ముందు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ కుమార్, ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, స్మితా సబర్వాల్ హాజరయ్యారు. మాజీ సీఎస్ ఎస్కే జోషి వర్చువల్ విధానంలో హాజరయ్యారు.
అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి కమిషన్ వివరాలు తీసుకొంది. వారందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలు ఉన్నందున తనకు కొంత సమయం కావాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్‌ను కోరారు. దీంతో ఆయనకు ఆగస్టు ఐదో తేదీ వరకు గడువిచ్చారు. ఇంకా కొంత మంది అధికారులు కూడా కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది.
Electricity Dept Eng Raghu on Kaleshwaram : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తలపెట్టిన తుమ్మడిహట్టిని కాదని, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతలకు చేపట్టడమే ప్రధాన తప్పు అని విద్యుత్‌శాఖ ఇంజనీర్ కె.రఘు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఆయన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రాణహిత - చేవెళ్ల మార్పు, మూడు బ్యారేజీల నిర్మాణం, నాణ్యత అంశాలు, పంప్ హౌస్‌లు మునక గురించి వివరించినట్లు తెలిపారు. ప్రాజెక్టు మార్పు వల్ల తెలంగాణ ప్రజలపై చాలా భారం పడిందని, ప్రతి ఏటా నిర్వహణ కూడా భారమే అని వివరించారు. మార్పుతో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు కోల్పోయామని, వేల ఎకరాలు ప్రతి ఏటా ముంపునకు గురవుతోందని రఘు వివరించారు.
గుత్తేదారుల నిబంధనలకు విరుద్ధంగా కొన్ని చెల్లింపులు : డీపీఆర్ ఆమోదానికి ముందే బ్యారేజీల నిర్మాణంతో డిజైన్లలో లోపాలు వచ్చాయని, బ్యారేజీ స్థలాల ఎంపికలో కూడా చాలా లోపాలు ఉన్నాయని అన్నారు. ఈపీసీ ఒప్పందం ప్రకారం ప్రక్రియ జరగలేదని, లోపాలు చాలా ఉన్నాయన్న ఆయన, గుత్తేదారులకు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని చెల్లింపులు చేసినట్లు చెప్పారు. 2019లో బ్యారేజీలు పూర్తయ్యాక నిర్వహణ చేపట్టిన పాపాన పోలేదని, అందుకే దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు.
పంప్ హౌస్‌లను నదీ మట్టం కంటే చాలా దిగువన నిర్మించారని, దీంతో మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్‌ల్లో పంపులు మునిగినట్లు రఘు కమిషన్ ముందు వివరించారు. ప్రాజెక్టుల్లో సమస్యలు ఉండవని తాను చెప్పడం లేదని, సమస్యలకు గల కారణాలు ముఖ్యమని అన్నారు. అంచనాలు తప్పుగా వేయడం, డిజైన్లలో లోపాలు ఉన్నాయన్న రఘు, త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇంజినీర్లకు సమయం ఇవ్వలేదని అన్నారు.