EC on Schemes Funds Release in AP: ఏపీలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల సంఘం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల డబ్బు జమ ఎన్నికలయ్యే వరకూ వాయిదా వేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బటన్ నొక్కిన ఆరు పథకాల డబ్బులు ఎన్నికల ముందు జమ చేసేందుకు వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు.
ఆ పథకాల నిధులు ఎన్నికల ముందు జమ అయ్యేలా వైఎస్సార్సీపీ ప్రణాళికలు వేసింది. అయితే ప్రస్తుతం ఆయా పథకాలకు చెందిన నిధులు ఎన్నికలు పూర్తి అయ్యాకే లబ్దిదారులకు డబ్బులు జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పథకాలకు సంబంధించి 14 వేల 165 కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని వైఎస్సార్సీపీ భావించింది.
ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలి: ఎన్నికల కోడ్ రాకముందే బటన్ నొక్కి విడుదల చేసిన ఈ పథకాలకు నిధులు జమ కాకపోవటంపై ఈసీ విస్మయాన్ని వ్యక్తం చేసింది. నిధులు జమ ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలని ఈసీ ప్రశ్నించింది. డీబీటీతో వెంటనే జమ అవుతున్నా ఎందుకు ఆలస్యమైందన్న ఈసీ, ప్రచారం ముగిశాక నిధులు జమ చేసే యత్నం జరుగుతోందని తెలిపింది. ఎన్నికల కోడ్ కంటే ముందుగానే నిధులు విడుదల చేసినా లబ్దిదారుల ఖాతాలకు వెళ్లకపోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే అంశంపై జాబితాను విడుదల చేసింది. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి రూ. 14 వేల 165.66 కోట్లకు ఎన్నికల కోడ్‌కు ముందే బటన్ నొక్కారని ఈసీ తెలిపింది. బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేసే డీబీటీ నిధులు 48 గంటల్లోగా లబ్దిదారులకు వెళ్లకపోవటంపై విస్మయం వ్యక్తం చేసింది.
ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్ ముందు 11, 12వ తేదీల్లో నిధుల విడుదలయ్యేలా ప్రయత్నాలు జరిగాయన్న సమచారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. పోలింగ్‌కు 2 రోజుల ముందు జమ చేస్తే కోడ్ ఉల్లంఘనే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాకే లబ్దిదారుల ఖాతాలలో జమ చేయాలని తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంతో పలు పథకాల డబ్బుల జమ వాయిదా పడింది. మే 13న పోలింగ్ పూర్తి అయ్యాక ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాలకు జమ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
పథకాల నిధుల విడుదలపై విచారణ- అత్యవసర పంపిణీపై వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు - HC on Input Subsidy Funds