Kondapalli Srinivas on Botsa Issue: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంత అవసరం తనకు లేదని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు కావాలనే తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
విజయనగరం జిల్లాలో 40 సంవత్సరాల రాజకీయ నేపథ్యమున్న తమ ఫ్యామిలీ బొత్స సత్యనారాయణ కుటుంబంపై పోరాడుతోందని అన్నారు. అలాంటిది తాను బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నానంటూ వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం: కాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లకి మంత్రి శ్రీనివాస్ మొక్కారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నవంబరు 11వ తేదీన లాబీలో ఇతర ఎమ్మెల్యేలతోపాటు కూర్చొని ఉండగా బొత్స సత్యనారాయణ అటువైపు రావడంతో అందరితోపాటు లేచి సంస్కారంతో పలకరించానని, అంతకుమించి ఏమీ జరగలేదని వెల్లడించారు. బొత్స సత్యనారాయణ కుటుంబం విజయనగరం జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం వల్ల అన్యాయమైనవాళ్లు ఆ వివరాలను తమ దృష్టికి తీసుకొస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
"జిల్లాలో ప్రజలంతా ఏకమై ఆ పార్టీ వాళ్లను ఎవరినీ కూడా గెలిపించకుండా, కూటమి నిలబెట్టిన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించారు. ఇప్పుడు మీరు ఒకసారి పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోంది. దీంతో దానిని తట్టుకోలేక వైఎస్సార్సీపీ నేతలను బలపరిచేందుకు, తమను బలహీనపరుస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేమేదో ఆయన కాళ్లు పట్టుకున్నామనేది పూర్తిగా అసత్య ప్రచారం. ఇందులో ఎటువంటి నిజం లేదు. వాళ్లు విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు". - కొండపల్లి శ్రీనివాస్, మంత్రి
ఇది వైఎస్సార్సీపీ రాజ్యం అనుకుంటున్నారా? - తోలు తీసి కూర్చోపెడతా ఖబడ్దార్ : పవన్ కల్యాణ్