Asifabad Rape Incident: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న(సెప్టెంబరు 27)న పాఠశాల ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఎనిమిదో తరగతి చదివే మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు జరిగిన దుర్ఘటన గురించి చెప్పింది. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు నిందితుడైన సాగర్ ఇంటికి వెళ్లి అడిగే ప్రయత్నం చేయగా తలుపులు పెట్టుకొని గది లోపలే ఉండిపోయాడు.
తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. బాలికను వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఈరోజు బూరుగూడ గ్రామస్థులు, విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.
కలెక్టర్ రావాలంటూ నినాదం: నిందితుడుకి కఠిన శిక్ష విధించాలని జాతీయ రహదారిపై రెండు గంటలపాటు బైఠాయించి కలెక్టర్ రావాలి, వి వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేశారు. రోడ్డుపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉరి శిక్ష విధించాలని విద్యార్థులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఇలాంటి వరుస సంఘటనలు జరిగినప్పటికీ అధికారులలో ఎలాంటి చలనం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ పిల్లలమైన మేము ఎక్కడికైనా వెళ్లాలంటే రక్షణ కరువైందని వాపోయారు.
కొద్ది రోజుల క్రితం జైనూరులో జరిగిన ఘటన మరిచిపోక ముందే మైనర్ బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమైన విషయం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మహిళలకు రక్షణ లేదని ఎందరో నిందితులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి పేరు, పలుకుబడితో నాయకుల అండదండలతో శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతున్నారని మండిపడుతున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి అఘాయిత్యాలు జరగవని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సుమారుగా రెండు, మూడు గంటల పాటు ధర్నాను విరమించలేదు. పోలీసులు కలుగచేసుకుని నిందితుడుకి పోక్సో చట్టాల పరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు, గ్రామస్థులు ధర్నా విరమించారు.
వైవాహిక అత్యాచారం కేసుల్లో భర్తలకు రక్షణపై - నేడు సుప్రీం కోర్ట్లో విచారణ