Greater Vijayawada Vijayawada Municipal Corporation : విజయవాడ నగర పాలక సంస్థను మహా విజయవాడ నగర పాలక సంస్థగా అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతోంది. ఇదే జరిగితే నగర చుట్టుపక్కల ప్రాంతాలు గ్రేటర్ వీఎంసీ (Greater VMC)లో విలీనం కానున్నాయి. ఫలితంగా నిధుల కేటాయింపు పెరిగి గ్రామ పంచాయతీలు, మేజర్ పంచాయతీల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది.
రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న విజయవాడను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేందుకు వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ జిల్లా సమీక్షా సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. కొంతమంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కమిషనర్ ధ్యానచంద్ర ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవంగా చుట్టుపక్కలున్న గ్రామాలు, మేజర్ పంచాయతీలు వీఎంసీలో భాగం కాకపోవడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.
జక్కంపూడి కాలనీ, గొల్లపూడి, కానూరులో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీల సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యలన్నీ తొలగి అభివృద్ధి చెందాలంటే విజయవాడ మహా నగరపాలక సంస్థగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయవాడను గ్రేటర్‌గా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
విజయవాడ గ్రేటర్‌గా మారితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ పరిధిలో ప్రస్తుత జనాభా 13 లక్షలు కాగా గ్రేటర్ నగరపాలక సంస్థలో ఈ ప్రాంతాలన్నీ కలిస్తే జనాభా 25 లక్షలకు చేరుకుంటుంది. విజయవాడ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. గ్రేటర్‌గా మార్పు చెందితే నియోజకవర్గాల సంఖ్యా పెరిగే అవకాశముంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు సైతం పెరుగుతాయి. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది.
విజయవాడ నగరం రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉంది. భవిష్యత్తులో విజయవాడ, అమరావతి జంట నగరాలుగా అభివృద్ధి చెందే వెసులుబాటు ఉంది. విజయవాడ నగరం గ్రేటర్ అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూముల రేట్లు పెరిగి స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంటుంది. దీంతో నగరం మరింత విస్తరించి ప్రగతి పరుగులు పెడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ నగరపాలక సంస్థను గ్రేటర్‌గా మార్చిన తర్వాతే కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేయాలని గతంలో ప్రణాళికలు రచించినా ఆచరణకు నోచుకోలేదు. ఈసారైనా కచ్చితంగా జరుగుతుందని స్థానికులు నమ్ముతున్నారు. ఆ దిశగా కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విజయవాడ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ - పెండింగ్ పనుల పరిష్కారానికి చర్యలు
విజయవాడలో ట్రాఫిక్ సమస్యపై 'అస్త్రం' - డ్రోన్ ద్వారా సమస్యకు చెక్ : సీపీ
నగరవాసులపై ఎడాపెడా పన్నుల మోత- 'ఎన్నికల్లో జగన్ సర్కార్‌కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిక'