Prahari Clubs Formed in High Schools to Combat Drug Abuse : తెలంగాణలో డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై కాగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా మత్తుపదార్థాలను వినియోగిస్తూ యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుంది. అందులో భాగంగా స్కూల్, కాలేజీల్లో డ్రగ్స్ వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టేందుకూ వెనకాడటం లేదు. తాజాగా స్కూల్ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు కొత్త తరహా ప్రాణాళిక అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పోలీసు నిఘాను పెంచిన సర్కారు, తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయనుంది. గతంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీదేవసేన పనిచేసిన సమయంలో ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపారు. తాజాగా వాటిని ఆమోదించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, శనివారం జీవోను జారీ చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలను వినియోగించకుండా, వాటిని పాఠశాల చుట్టుపక్కల ఎవరూ విక్రయించకుండా ఈ క్లబ్‌లు పటిష్ఠ చర్యలు తీసుకొనున్నాయి. డ్రగ్స్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంచడంతోపాటు నిరంతరం నిఘా వేసి ఉంచుతాయని జీవోలో తెలిపారు.
అధ్యక్షుడిగా ప్రధానోపాధ్యాయుడు పాఠశాల ప్రహరీ క్లబ్‌కు అధ్యక్షుడిగా ప్రధానోపాధ్యాయుడు / ప్రిన్సిపల్, ఉపాధ్యక్షుడిగా సీనియర్ ఉపాధ్యాయుడు / పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండే టీచర్ ఇందులో ఉంటారు. సభ్యులుగా 6 నుంచి 10 తరగతుల వరకు ఒక్కో తరగతిలో ఇద్దరు విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల నుంచి ఒకరు ఉంటారు. స్థానిక పోలీసుస్టేషన్ నుంచి ఒకరు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ క్లబ్‌లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధుల్లో పోలీసు శాఖ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ డ్రగ్స్‌ను నివారించాలని ఆదేశించారు. ప్రహరీ క్లబ్‌లు పనిచేసే విధానంపై మరిన్ని మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్స్ - డ్రగ్స్‌ను నియంత్రించడమే లక్ష్యం