Burra Venkatesham Appointed as TGPSC Chairman : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. బుర్రా వెంకటేశం నియామక ఫైల్‌పై గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుత టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో బుర్రా వెంకటేశం ఐఏఎస్‌కు స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బుర్రా వెంకటేశం సర్వీస్ 2028 ఏప్రిల్ 10 వరకు ఉంది.
బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా గరిష్ఠంగా 2030 ఏప్రిల్ 10 వరకు కొనసాగే అవకాశం ఉంది. జనగామ జిల్లాకు చెందిన బుర్రా వెంకటేశం ప్రస్తుతం విద్యాశాఖ, గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా జనవరిలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు టీజీపీఎస్సీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయగా, అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనున్న నేపథ్యంలో బుర్రా వెంకటేశంను నూతన ఛైర్మన్‌గా నియమించారు.