DSC Candidate Missed Teacher Post : ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనేది ఆ యువతి చిరకాల స్వప్నం. దీంతో పట్టుదలగా చదివి డీఎస్సీ -2024లో మంచి ర్యాంకు సాధించింది. ఎస్జీటీతో పాటు ఎస్‌ఏ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఉప్పొంగిపోయింది ఆ యువతి. తీరా ఉద్యోగంలో చేరేందుకు వెళ్తే జాబ్ లేదని చెప్పడంతో కన్నీరుమున్నీరైంది.
అసలేం జరిగిందంటే? : నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండకు చెందిన రచన డీఈడీ, బీఈడీ పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (భౌతిక శాస్త్రం) విభాగంలో 5వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 60వ ర్యాంకు సాధించారు. దీంతో అక్టోబరు 8న నిజామాబాద్ డీఈవో కార్యాలయంలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లారు. ఎస్‌ఏ విభాగంలో మూడే పోస్టులు ఉండడంతో, తనకు వచ్చే అవకాశం లేదని గమనించి ఎస్జీటీ పోస్టు ఎంచుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లారు. కానీ అధికారులు ఎస్‌ఏ పోస్టు వస్తుందని, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నందున దాన్నే ఎంపిక చేసుకోవాలని చెప్పడంతో ఎస్జీటీ పోస్టుకు నాట్ విల్లింగ్ లేఖ ఇచ్చారు.
ఎస్‌ఏ పోస్టుకు ఎంపికైనట్లు నియమాక పత్రం : అక్టోబరు 9న హైదరాబాద్‌లో నిర్వహించిన సీఎం రేవంత్ సమావేశానికీ తీసుకెళ్లారు. ఆ సభలో ఎస్‌ఏ పోస్టుకు ఎంపికైనట్లు నియమాక పత్రం కూడా ఇచ్చారు. దీంతో మరుసటి రోజు ఉద్యోగంలో చేరేందుకు డీఈవో కార్యాలయానికి వెళ్తే, కంప్యూటర్ తప్పిదంతో ఉద్యోగం లేదని అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా కంగుతున్న యువతి విద్యాశాఖ అధికారుల సూచనతోనే తాను పోస్టు ఎంపిక చేసుకున్నానని, తీరా ఇప్పుడు ఉద్యోగం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజావాణికి వచ్చి వినతి పత్రం : బాధితురాలు సోమవారం ప్రజావాణికి వచ్చి కలెక్టర్, డీఈవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయమై డీఈవో దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా, కలెక్టర్‌తో పాటు నాకూ ఈ విషయం తెలుసని దీని గురించి విద్యాశాఖ కమిషనర్‌కు లేఖ రాశామని తెలిపారు. ఈ సమస్య రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని తెలిపారు.
వచ్చేనెలలోనే నోటిఫికేషన్ - డీఎస్సీకి సిద్ధం కండి!
మెగా డీఎస్సీకి ఫ్రీ కోచింగ్‌తో పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు - దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే ?