Drug Bust in Gachibowli Radisson Hotel : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ సేవించిన కేసులో మంజీరా గ్రూప్ డైరెక్టగా ఉన్న వివేకానంద్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి హోటల్లో కొకైన్ సేవిస్తున్నారన్న సమాచారంతో మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు (SOT Police) సోదాలు చేశారు. కానీ అప్పటికే కొకైన్ సేవించిన వివేకానంద్ అతని స్నేహితులు పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో అక్కడి నుంచి పారిపోయారు.
దీంతో ఆతని ఇంటికి వెళ్లిన పోలీసులు అతి కష్టం మీద వివేకానంద్‌ను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం, అతని వద్ద కొకైన్ సేవించేందుకు వినియోగించిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో గత రాత్రి కేదార్, నిర్భయ్‌లను కూడా అరెస్ట్ చేశారు. వీరికి సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్పెరీ డ్రగ్స్ సరఫరా (Drugs Supply) చేసినట్లు గుర్తించారు.
Manjira Group Director Arrest in Gachibowli Drugs Case : గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద పోలీసుల విచారణలో అంగీకరించారు. డ్రగ్స్ వినియోగించిన ఇద్దరు యువతులు సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు వీరికి కొకైన్ విక్రయించిన అబ్సాస్ అలీపై కూడా కేసు నమోదు చేశారు. కొకైన్‌ను పేపర్ రోల్లో చుట్టి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా - టీఎస్ న్యాబ్ బలోపేతానికి అధికారుల ప్రణాళిక
తరచూ ఆదే హోటల్లో డ్రగ్స్ పార్టీలు చేసుకుంటునట్లు విచారణలో వివేకానంద్ వెల్లడించారు. అతడితో పాటు డ్రగ్స్ పార్టీలో కేదార్, నిర్భయ్, క్రిష్, నీల్, లిషి, స్వేత, సందీప్, రఘుచరణ్‌లు పాల్గొన్నారని తెలిపారు. ఇప్పటికే వివేకానంద్‌తో పాటు కేదార్, నిర్భయ్‌లను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు, నిందితులపై ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇలాంటి పార్టీలకు అనుమతించిన హోటల్‌పై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నిందితుల వద్ద మూడు సెల్ఫోన్లు (Mobiles) స్వాధీనం చేసుకోగా వాటిలోని డేటాను నిందితులు డిలీట్ చేశారని దానిని రీట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన హైదరాబాద్ డ్రగ్స్ మహమ్మారి ఏదో రూపంలో బయటపడుతునే ఉందని, తాజా ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు.
"గత శుక్రవారం రాత్రి రాడిషన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం మాధాపూర్ ఎస్‌ఓటీ పోలీసులకు అందింది. కానీ అప్పటికే కొకైన్ సేవించిన వారు అక్కడినుంచి పారిపోయారు. ఈ క్రమంలోనే హోటల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా, కొకైన్ సేవించేందుకు వాడిన కాగితాలు దొరికాయి. దీంతో అక్కడ మత్తు దందా జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అందులో భాగంగానే ప్రధాన నిందుతుడైన మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద్‌ను అరెస్ట్ చేశారు."-అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీ
రూ.1100 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్- గోడౌన్లలో దాచిన 600కిలోలు స్వాధీనం
భాగ్యనగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న డ్రగ్స్ మహమ్మారి - యువతను దాటి మైనర్ల వరకు!