Drinking Water Problem in Ongole : నగర పాలక సంస్థ ఒంగోలులో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. తాగునీటి కోసం గత ప్రభుత్వం 120 కోట్ల రూపాయలతో ప్రారంభించిన అమృత పథకం (Amrut Scheme) పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అదనపు తాగునీటి పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటకెక్కించింది. అమృత పథకంలో 120 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇది పూర్తయితే గుండ్లకమ్మ నుంచి పట్టణ వాసులకు సమృద్దిగా తాగునీరు అందించే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం ఊసే ఎత్తడం లేదు.
పట్టణంలో 90 వేల గృహాలకు 3.10 లక్షల జనాభాకు నిత్యం తాగునీరు అందించాల్సి ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి వచ్చే కృష్ణా నది నీటిని పట్ణణంతో పాటు, చుట్టుప్రక్కల ఉన్న విలీన గ్రామాలకు కూడా అందివ్వాలి. రోజూ నీటిని సరఫరా చేసే సామర్థ్యం లేక మూడు, నాలుగు రోజులకు ఒక సారి ఇస్తున్నారు.
పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి ప్రస్తుతానికి నీటిని పంపిణీ చేస్తారు. మరో 10 ట్యాంకులు అవసరాలు ఉన్నా, ఆ దిశగా ఈ ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. పేర్లమాన్యం ప్రాంతంలో దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన ట్యాంకుకు పైపు కనక్షన్లు ఇవ్వకపోవడం వల్ల వృథాగా పడి ఉంది. అదే విధంగా ముక్తినూతలపాడులో 7 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టినా, దానికి గుండ్లకమ్మ నుంచి ఇవ్వాల్సిన పైపు లైను ఏర్పాటు చేయలేదు.
"నీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. తాగునీటి పంపులు ఉన్నాయి. కానీ అందులో రెండు బిందెలు కంటే ఎక్కువ రావు. అవి కూడా రెండు, మూడు రోజులకు ఒకసారి వస్తుంటాయి. 5, 6 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది. ఒక ఇంటికి రెండు డ్రమ్ములు నీటినే నింపుకొవాలి. అధికారులు స్పందించి మా నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నాం."- మహిళలు
తాగునీటి సమస్యపై మహిళల నిరసన సెగ- ఎట్టకేలకు బస్సు దిగొచ్చిన సీఎం జగన్ - Women Protest CM Jagan
అమృత పథకం క్రింద పట్టణంలో నిర్మించిన ట్యాంకులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు చోట్ల పైపు లైన్లు వేయకుండా వదిలేసారు. తుప్పల్లో గొట్టాలు పడి ఉన్నాయి. తాగునీటి పథకాలు పెరగకపోవడం వల్ల పట్టణంతో పాటు, చుట్టూ ఉన్న కాలనీలు కేసవరాజుగుంట, శ్రీరామ నగర్, ఆంధ్ర కేసరి నగర్, రాజీవ్ కాలనీ, సమతా నగర్, కొప్పోలు, నేతాజీ కాలనీ, మథర్ తెరిసా కాలనీ తదితర ప్రాంతాల్లో నిత్యం తాగునీటికి యాతనే. కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా కానీ కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ట్యాంకర్లు కూడా సక్రమంగా రావడం లేదని వాపోతున్నారు.
సాగర్ నుంచి నీటిని మళ్లించడం, అమృత పథకంలో చేపట్టిన తాగునీటి పథకాన్ని పూర్తి చేయడం, వంటి కార్యక్రమాలు చేపడితే గానీ పట్టణ వాసులకు తాగునీటి ఇబ్బందులు తొలగవు.
ఎండిన నీటికుంట - నిండుకున్న నీళ్లు - పట్టించుకోని సర్కార్ - Drinking water problem