Doctor Family Suicide in Vijayawada: విజయవాడ పటమట వాసవీనగర్‌కు చెందిన ధరావత్ శ్రీనివాస్ ఎముకుల వైద్యుడు. భార్య ఉష , కుమార్తె శైలజ, కుమారుడు శ్రీహన్, తల్లి రమణమ్మతో కలసి ఉంటున్నాడు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ పోలీసుశాఖలో పని చేసి పదేళ్ల క్రితం మరణించారు. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో న్యాయాధికారిగా ఉన్నారు. వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు.
శ్రీనివాస్ గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, విశాఖలో ఆర్థోపెడిక్‌లో పీజీ చేశారు. విజయవాడలోని పలు ఆస్పత్రుల్లో వైద్యుడిగా సేవలందించారు. సొంతంగా అస్పత్రిని ప్రారంభించేందుకు గతేడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. సుమారు 3 కోట్ల మేర వెచ్చించినా అది వినియోగంలోకి రాలేదు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ స్నేహితులు కొందరు భాగస్థులుగా చేరారని వారు శ్రీనివాస్‌ను మోసగించి రోడ్డున పడేశారని బంధువులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలుగా శ్రీనివాస్ కుంగుబాటులో ఉన్నారని వివరించారు.
వైఎస్సార్ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య - Family Suicide case
ఆత్మహత్య చేసుకునే ముందు ఇంట్లోని నగదు, బంగారాన్ని ఓ బ్యాగులో సర్దిన శ్రీనివాస్, దానిని తన కారులో ఉంచారు. అనంతరం తన ఎదురింటి గేటుకు ఉన్న పాలపెట్టెలో కారు తాళానికి కాగితం చుట్టి అందులో వేశారు. తాను ఊరు వెళ్తున్నానని అన్నయ్య వస్తే కారు తాళం ఇవ్వమని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి పోర్టికోలో శ్రీనివాస్ ఉరి వేసుకుని ఉండటాన్ని గుర్తించారు. స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందారు. వెంటనే ఎదురింటివారు కారు తాళానికి చుట్టిన కాగితం చూడగా తన అన్నయ్య దుర్గా ప్రసాద్‌కు మాత్రమే ఇవ్వమని, అతని ఫోన్‌నెంబరు రాసి ఉంది. దీంతో వారు న్యాయాధికారి దుర్గాప్రసాద్‌కు విషయాన్ని తెలపగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక వేర్వేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి, భార్య, పిల్లలను శ్రీనివాస్ చాకుతో మెడ భాగంలో కోయడంతో వారంతా చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. చనిపోక ముందు శ్రీనివాస్ తన ఫోన్‌లో వాయిస్‌ను రికార్డ్ చేసుకున్నారు. అందులో కారులోని బ్యాగులో ఉంచిన నగదు, బంగారు నగలను తన అన్న దుర్గాప్రసాద్‌కు ఇవ్వమని ఉంది. పోలీసులు కారులోని 16 లక్షల నగదు, 300 గ్రాము బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వార్డెన్ ఆత్మహత్య: కృష్ణా జిల్లా అవనిగడ్డ సబ్ జైల్ నందు జైల్ వార్డెన్‌గా పనిచేస్తున్న దాసరి నాగ శివకుమార్ (37)ఆత్మహత్య చేసుకున్నారు. శివకుమార్ అవనిగడ్డలో తాను నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్డెన్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్‌ను ఢీకొన్న బైకు - ఇద్దరు మృతి: ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను బైకు ఢీకొట్టడంతో, ఘటనాస్థలిలోనే తండ్రి, కుమార్తె మృతి చెందారు. కుమారుడు, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని ఏలూరు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం - BRIDE SUICIDE IN KOTHAGUDEM