District Collectors Inspection of EVMs Across the State : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకులతో పాటు అధికారులలో సైతం అలజడి మెుదలైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్న అధికారులు వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎన్నికలు సజావుగా జరగటానికి అన్ని జిల్లాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్లు ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
ప్రకాశం జిల్లాలో కలెక్టర్ దీనేష్ కుమార్ ఈవీఎం యత్రాల పనితీరు, స్ట్రాంగ్ రూం లను పరిశీలించారు. మామిడిపాలెంలోని గోదాములలో ఉన్న ఈవీఎంలను సాధారణ తనిఖీలలో భాగంగా పర్యవేక్షించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా బ్యాలెట్ యానిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లను పరిశీలించారు. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు అవసరం కన్నా 20 శాతం, వీవీప్యాట్లు 30 అదనంగా ఉన్నాయని తెలిపారు. అలాగే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఈవీఎంలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ సాదారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Collectors Inspects Strong Rooms in AP : అనంతపురం జిల్లాలో ఎస్వీజీఎం ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ గౌతమి, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయ పార్టీలతో కలిసి ప్రచారం చేస్తున్న వాలంటీర్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఎంతటి వారైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. ఖాళీ ఈవీఎంలను ఇప్పటికే జిల్లా కేంద్రంలో సిద్ధం చేసి ఉంచామని, ఏప్రిల్ 12వ తేదీ ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలను తీసుకెళ్లి అక్కడి స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తామన్నారు. స్ట్రాంగ్ రూంలో భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర వాటిని పరిశీలించడానికి ఎస్పీతో కలిసి పర్యవేక్షించినట్టు వెల్లడించారు.
EVMs Verification in All Districts : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు ఎన్నికల పక్రియలో భాగంగా తిరువూరులోని ఆంధ్ర, తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్‌ను విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలను భద్రపరిచేందుకు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ప్రజలు సీ-విజిల్ యాప్ ద్వారా తమ సమస్యలు, ఫిర్యాదు తెలిపితే గంటలో సంబంధిత అధికారులు పరిష్కారం చూపుతారన్నారు. ఎన్నికల సమాచారం కోసం తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో మీడియా సెల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లపై కొరడా ఝుళిపించిన ఎన్నికల సంఘం
విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ, జిల్లాలో 21 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున ఫ్లైయింగ్ స్క్వాడ్స్లను నియమించినట్టు తెలిపారు. 50 వేలకు మించి నగదును తీసుకెళ్లరాదు. అలా తీసుకెళ్తే తప్పనిసరిగా ఆధారాలు చూపించాలన్నారు. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో కోటి రూపాయల నగదు, 2.6 కేజీల బంగారం, 4.4 కేజీల వెండి సీజ్ చేసినట్టు తెలిపారు.
ఎందుకు నిర్లక్ష్యం వహించారు ? - హింసాత్మక ఘటనలపై ఎస్పీలకు ఈసీ సూటిప్రశ్న