Discussion on Rushikonda Palace in AP Assembly: శాసనసభ ప్రశ్నోత్తరాల్లో రుషికొండ భవనాల కోసం చేసిన వ్యయంపై చర్చించారు. రుషికొండ ప్యాలెస్ కోసం మొత్తం 409 కోట్ల రూపాయల వ్యయం అయిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రతీ చదరపు అడుగును 23 వేల 261 రూపాయల వ్యయంతో మొత్తం 1,45,765 చదరపు అడుగుల నివాస స్థలం నిర్మించారని వెల్లడించారు. దీనిపై చర్చ సందర్భంగా శాసనసభ్యులు తీవ్రంగా స్పందించారు. విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్ను జీవిత కాలం జైల్లో పెట్టినా తప్పు లేదని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.
రుషికొండ ప్యాలెస్‌లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని అన్నారు. ప్రజాధనం ఖర్చు చేసిన తీరు చూస్తుంటే ఏమనాలో అర్థం కావట్లేదని మండిపడ్డారు. జగన్ భవనం కోసం పెట్టిన ఖర్చు చూస్తే సామాన్యుల కళ్లు తిరిగిపోవాల్సిందేనని పేర్కొన్నారు. పాపం నిరుపేద జగన్ ముచ్చటపడి కట్టుకున్న భవనం ఇది అంట అని ఎద్దేవా చేశారు. రుషికొండ ప్యాలెస్‌లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్‌లు తానెక్కడా చూడలేదన్నారు. ప్రజల డబ్బును దోపిడీ చేసి రుషికొండ ప్యాలెస్‌లో భవనం కట్టారని విమర్శించారు.
అధికారులు కూడా దోపిడికీ, దుర్వినియోగానికి సహకరించారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ప్యాలస్ కోసం ఖర్చు చేసిన రూ.409 కోట్ల సొమ్ము 22 వేల 743 ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్లతో సమానం అని విష్ణు కుమార్ రాజు గుర్తు చేశారు. తలుపు ఖర్చు రూ.31 లక్షలు అని, ఒక్కో కమోడ్ వ్యయం 11.46 లక్షలుగా ఉందని వాపోయారు. మాజీ సీఎం జగన్ కుట్ర, అధికార దుర్వినియోగంపై విచారణ చేయించాలని డిమాండ్ చేయగా, ఈ అంశంపై సోమవరం ప్రత్యేకంగా చర్చించేందుకు సమయం ఇస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమాధానమిచ్చారు.
అది జగన్ కట్టుకున్న రాజకీయ సమాధి: ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ రుషికొండ నిర్మాణాలను వైఎస్ జగన్ కట్టుకున్న రాజకీయ సమాధిగా పరిగణించాలన్నారు. ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా నియంత కట్టుకున్న విలాస భవనాలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలిసేలా వారిని సందర్శనకు అనుమతించాలని ప్రభుత్వానికి రఘురామ సూచించారు. రుషికొండ వ్యవహారాన్ని రామకృష్ణబాబు, మూర్తియాదవ్ వెలుగులోకి తెచ్చారని, అదేసమయంలో ఎన్జీటీలో తాను ఒక రిప్రెజెంటేషన్ ఇచ్చానన్నారు. తన రిప్రెజెంటేషన్‌ను సుమోటోగా తీసుకుని నిర్మాణాలు ఆపాలని తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.
కమోడ్ రూ.11లక్షలు - ఆ బాత్రూం ఖర్చుతో విశాఖలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనొచ్చు!
గత ఐదేళ్లలో 227 ఎంవోయూలు - పైసా పెట్టుబడి రాలేదు: సీఎం చంద్రబాబు