Discoms proposals To EV Charging Rates : ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీటిని భరించే ఓపికలేని ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు(ఈవీ) ఛార్జింగ్ పెట్టుకునేందుకు చెల్లించాల్సిన ఛార్జీలను విద్యుత్ డిమాండుకు అనుగుణంగా నిర్ణయించినట్లు రెండు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లూ తెలిపాయి.
రాష్ట్రంలో సాధారణంగా ఈవీ ఛార్జింగ్ పెట్టుకుంటే యూనిట్‌కు రూ.6 కరెంటు ఛార్జీని వసూలు చేస్తున్నాయి. కానీ రోజూ పగటిపూట కొన్ని సమయాల్లో అన్ని వర్గాల వినియోగదారులు కరెంటును ఒకేసారి వినియోగిస్తున్నందున గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఏర్పడుతోంది. తిరిగి రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ ఒక్కసారిగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో గరిష్ఠ డిమాండ్ ఉండే సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకూ ఈవీల ఛార్జింగ్ పెట్టుకుంటే యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తామని ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ)కిచ్చిన ప్రతిపాదనల్లో తెలిపాయి.
విద్యుత్ డిమాండ్ బాగా పడిపోయే సమయం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ ఛార్జింగ్ పెట్టుకుంటే యూనిట్‌కు రూ.5 చొప్పున మాత్రమే కరెంటు ఛార్జీని వసూలు చేస్తామని డిస్కంలు ప్రతిపాదించాయి. మిగిలిన సమయాల్లో అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రం యూనిట్‌కు రూ.6 చొప్పున వసూలుచేయాలని భావిస్తున్నారు. ఈఆర్‌సీ ఆమోదం అనంతరం ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయి. డిస్కం ధరకు అదనంగా నిర్వహణ వ్యయాన్ని కలిపి ఆయా స్టేషన్ల నిర్వాహకులు యూనిట్ ధరను వసూలు చేస్తారు. రాష్ట్రంలో లోటెన్షన్(ఎల్‌టీ) కేటగిరీలో 508, హైటెన్షన్(హెచ్‌టీ)లో 21 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల కరెంటు కనెక్షన్లు ఉన్నట్లు డిస్కంలు తెలిపాయి.
ఛార్జింగ్ స్టేషన్‌లోనే బ్యాటరీ మార్పు : ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీ మార్చుకునే ప్రక్రియను సులభతరం చేస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ప్రతి ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లో బ్యాటరీని మార్చుకునేందుకు(స్వాపింగ్) అవకాశం కల్పించింది. పూర్తిగా ఛార్జింగ్ చేసిన బ్యాటరీలను అద్దెకు కూడా ఇవ్వవచ్చని కేంద్రం తెలిపింది. ఈవీలో ఉన్నదానితో పాటు అదనంగా మరో బ్యాటరీ ఉంటే సొంత కరెంటు కనెక్షన్ నుంచి దానిని ఛార్జింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.
బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల(బీఎస్‌ఎస్) లేదా బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ల(బీసీఎస్)ను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఛార్జింగ్ లేని సమయంలో బ్యాటరీల నుంచి అవసరమైతే కరెంటును గ్రిడ్‌కు కూడా సరఫరా చేసుకునే సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల దేశంలో విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసుకునే సౌకర్యాలు పెరుగుతాయని వివరించింది.