Disadvantages In Telugu of Not Chewing Food : ఉరుకులు, పరుగుల జీవితంలో ఏ పనీ ప్రశాంతంగా చేయలేకపోతున్నారు. కావాల్సింది తినాలి అనుకున్నా కానీ గబగబా తింటున్నారు. ప్రస్తుతం చాలా మంది టీవీ లేదా చరవాణి చూస్తునో యథాలాపంగా తింటున్నారు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా కాకుండా ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా, నిదానంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తొందర తొందరగా తీసుకుంటే అసలు ఎంత తిన్నామనేది తెలియకపోగా, రుచిని కూడా ఆస్వాదించలేమట. ఆ అవకాశాన్ని కోల్పోతామని చెబుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి పని యాంత్రికంగా మారిందనే దాంట్లో సందేహమే లేదు. అన్నింట్లోకి చరవాణి దూరిపోయి మనిషని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఆహారాన్ని ఎలా తింటున్నారని ఈటీవీ భారత్ 100 మంది యువత, మధ్య వయస్కులను సర్వే చేయగా వెల్లడైన విషయాలు ఇలా ఉన్నాయి.
అన్నం తినడానికి ఎంత సమయం తీసుకుంటున్నారని ప్రశ్నించగా
- 10 నిమిషాలు - 26 మంది
- 15 నిమిషాలు - 42 మంది
- 20 నుంచి 30 నిమిషాలు - 32 మంది
తినే సమయంలో టీవీ లేదా సెల్‌ఫోన్ చూస్తున్నవారు
- చూస్తున్నారు - 59 మంది
- చూడటం లేదు - 29 మంది
- అప్పుడప్పుడు - 12 మంది
నమిలి తింటున్నారా?
- అవును - 33 మంది
- లేదు - 57 మంది
- చెప్పలేం - 10 మంది
నమిలి తింటే ఎంతో ఆరోగ్యం : పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు ప్రశాంతంగా నమిలి తినడం ద్వారా లాలాజల గ్రంథులు చురుగ్గా పని చేస్తాయి. బాగా నమలడం ద్వారా ఆహారం మెత్తగా మారి జీర్ణ వ్యవస్థకు శ్రమను తగ్గిస్తుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. నమిలి తింటున్నప్పుడు నాలుకకు రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడుపైనా పడుతుంది. దీంతో శరీరంలో మేలు చేసే ఎన్నో హార్మోన్లు విడుదలవుతాయి. ఆహారాన్ని బాగా నమిలి తినడం ద్వారా అందులోని పోషకాలు శరీరానికి త్వరగా అందడంతో బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
తరచూ ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నట్లే! - Bad Digestion Symptoms
నమలడం : మనం తీసుకునే ఆహారాన్ని సరిగ్గా నమలడంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మంది సరిగ్గా నమలకుండా అలాగే మింగుతుంటారు. అది మంచిది కాదు. అలాకాకుండా మీరు తీసుకున్న ఫుడ్‌ను బాగా నమలాలి. అలా చేయడం ద్వారా ఘన పదార్థాలు చిన్న ముక్కులుగా మారతాయి. అప్పుడు దాని ఉపరితల వైశాల్యం పెరిగి, పొట్టలోని జీర్ణ రసాలు మెరుగ్గా పని చేస్తాయి. దాంతో జీర్ణక్రియ మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇలా మీరు చేసినప్పుడు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దాంతో జీర్ణక్రియ త్వరగా జరిగి, కావాల్సిన పోషకాలు అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
తిన్నది అరగడం లేదా? అయితే వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాల్సిందే! - Digestion Problem In Monsoon