Cyber Frauds Rising in AP : రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రోజుకో వేషంతో మోసాలకు పాల్పడుతున్నారు. మన అమాయకత్వం, అలక్ష్యాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి, ఇంటి నుంచే సంపాదన, లక్కీ డ్రా, బహుమతులు గెలిచారని అంటూ బోల్తా కొట్టిస్తున్నారు. మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, చివరకు ఐఏఎస్‌లూ బాధితులుగా మారుతున్నారు. బాధితులు పోగొట్టుకున్న సొమ్ము అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
కేసులంటూ బెదిరించి : గత నెల 6న తిరుపతికి చెందిన ఓ వ్యక్తికి ముంబయి డీటీడీసీ కొరియర్ మేనేజర్ అంటూ ఫోన్ వచ్చింది. మీ పేరు, ఆధార్ వివరాలతో ముంబయి నుంచి తైవాన్‌కు పార్సిల్ బుక్ చేశారని అందులో డ్రగ్స్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పాడు. ఆ పార్సిల్‌ను సైబర్ పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారంటూ ఆ విభాగం ఎస్సైకు కాల్‌ను అనుసంధానం చేశాడు. అతడు యాసిన్ మాలిక్ అనే క్రిమినల్ మీ ఆధార్ వివరాలతో 24 బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపారని, మీకు 15 శాతం కమీషన్ ఇస్తున్నారని బెదిరించాడు. విచారణలో నిజానిజాలు తేల్చడానికంటూ మూడుసార్లు రూ.6.25 లక్షలు జమ చేయించుకున్నాడు. చెక్ ద్వారా మరింత సొమ్ము పంపాలని చెప్పడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించాడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
పెట్టుబడి పెట్టి మోసపోయి : తిరుపతికి చెందిన ప్రముఖ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకుంటున్నారా అయితే ఈ లింకు క్లిక్ చేయండంటూ’ ఓ మెసేజ్ వచ్చింది. అందులో కొంత పెట్టుబడి పెట్టగా రెట్టింపు కలిపి అకౌంట్‌కు జమైంది. ఇలా నాలుగైదు దశల్లో ఆదాయం చూపి రూ.10,000లు దాటిన పెట్టుబడులకు టెలిగ్రామ్ లింకును పంపారు. ఇలా ఏకంగా రూ.96 లక్షలు దోచేశారు. వెంటనే బాధితుడు తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు రూ.37 లక్షలు రివకరీ చేయగలిగారు.
ఏపీకే యాప్‌లతో : వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్‌తోపాటు లింకులు ఎక్కువగా వస్తున్నాయి. పొరపాటున వాటిని క్లిక్ చేశారో మీ ఫోన్ కంట్రోల్ (ఎనీ డెస్క్) మొత్తం అపరిచితుల చేతుల్లోకి వెళ్తుంది. స్నేహితులు, బంధువులకు మీరు పంపినట్లుగా సమాచారం చేరవేసి డబ్బు కాజేస్తారు. గుగుల్‌పే, ఫోన్‌పే ద్వారా దోచుకుంటున్నారు.
అపరిచిత కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి : అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. వ్యక్తిగత పిన్ నంబరు, ఓటీపీలు షేర్ చేయొద్దని చెప్పారు. కమిషన్లకు కక్కుర్తిపడి అనుమానిత ఖాతాలకు డబ్బు తరలించడం, రిజిస్టర్ కాని సంస్థల్లో పెట్టుబడులు ఏమాత్రం క్షేమం కాదని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు గురైనట్లు గుర్తించిన వెంటనే 1930 ను సంప్రదించాలని సూచించారు. సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చని సుబ్బరాయుడు వెల్లడించారు.
వైద్యుడిని భయపెట్టి రూ.33 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు - Cyber Crime in Satya Sai District