Stealing in Trains Gang Arrested in Dharmavaram : అర్ధరాత్రి రైళ్లలో ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని, అంతరాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు రైల్వే పోలీసులకు సవాల్‌గా మారాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణీకుల ఏమరపాటు దొంగలకు అనువుగా మారుతోంది. సెల్‌పోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారు. విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లే మహిళలు విలువైన ఆభరణాలు ధరిస్తున్నారు. బోగీల్లో చేరిన ముఠా సభ్యులు కొందరు ప్రయాణికల మధ్య చేరి పరిసరాలను అంచనా వేస్తారు. ప్రయాణికులంతా ఆదమరచి నిద్ర పోతున్నారని నిర్ణయించుకున్నాక విలువైన వస్తువులు దొంగిలించి క్షణాల్లో అక్కడినుంచి పరారవుతున్నారు.
రైల్వే ప్రయాణికులే టార్గెట్ : తాజాగా రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లను టార్గెట్ చేసుకుని వారికి కూల్ డ్రింక్‌లలో మత్తుమందు కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి రైల్వే సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం యూపీకి చెందిన దొంగల ముఠా రైళ్లలోని ప్రయాణికులతో పరిచయం పెంచుకుంటారు.
ఆ తర్వాత పుట్టినరోజు అని లేదా ఉద్యోగం వచ్చిందని నిందితులు చెబుతారు. ఆ తర్వాత ముందుగా మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ప్రయాణికులకు ఇస్తారు. అనంతరం వారు మత్తులోకి జారుకున్నాక ప్రయాణికుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులన్నీ చోరీ చేస్తారు. పని అయిపోగానే ఈ ముఠా తర్వాతి స్టేషన్లో దిగిపోతారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ముఠాపై నిఘా పెంచామని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.
Train Robberies in AP : అనంతరం పక్కా సమాచారంతో ముగ్గురు నిందితులను వలపన్ని పట్టుకున్నామని సీఐ అశోక్‌కుమార్ వివరించారు. వారి నుంచి 52 గ్రాముల బంగారం, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 895 నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చోరీ చేసిన సొత్తును లుథియానికి చెందిన ఓ వ్యక్తికి అప్పగిస్తారని చెప్పారు. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. నిందితులను రిమాండ్ తరలించినట్లు సీఐ అశోక్‌కుమార్ వెల్లడించారు.
మొగల్తూరులో వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్న దొంగలు - Serial Thefts in West Godavari Dist