Dharani Portal Services : తెలంగాణ రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లలో కీలకంగా వ్యవహరిస్తున్న ధరణి పోర్టల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డేటాబేస్ వర్షన్ అప్‌గ్రేడ్ కారణం చేత తాత్కాలికంగా ధరణి పోర్టల్ సేవలను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల(డిసెంబర్) 16వ తేదీ ఉదయం వరకు పోర్టల్ డేటాబేస్ అప్‌గ్రేడ్ వల్ల సమస్య కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
16వ తేదీ ఉదయం నుంచి మళ్లీ యథావిధిగా ధరణి పోర్టల్ సేవలు కొనసాగుతాయని తెలిపాయి. నెల రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వాహణను విదేశాలలో ఉండే కంపెనీ నుంచి ఎన్ఐసీ(National Informatic Center)కి బదలాయింపు చేసింది. ఈ ప్రక్రియ దాదాపు నెల రోజులుగా జరుగుతోంది. ఇది తుది దశకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ స్లాట్స్ బుక్ చేసుకోవాలని తెలిపారు.
ధరణి యాప్, ఆర్వోఆర్-2024 చట్టం : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. గతంలో రూపొందించిన సాప్ట్‌వేర్‌లో చాలా అవకతవకలు జరిగాయని, చాలా మంది రైతులు భూములు కోల్పోయారని హస్తం నేతలు ఆరోపించారు. ఆ సమస్యలు లేకుండా వెబ్సైట్లో మార్పులతో పాటు పోర్టల్ నిర్వహణను ఈ నెల(డిసెంబర్) ఒకటో తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్‌ఐసీకి మార్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2020 ఆర్వోఆర్ చట్టంలో లోపాలను సరిదిద్ది 2024 ఆర్వోఆర్(Rights of Record) చట్టం తెస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే పోర్టల్ డేటాబేస్ అప్‌గ్రేడ్ జరుగుతోందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ చేసిన కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపు టపాసులా పేలుతుంది : పొంగులేటి