Dharani Portal Issues 2024 : తెలంగాణలో 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం భూ దస్త్రాల్లో మార్పులు-చేర్పులన్నీ కలెక్టర్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. తీరిక లేని విధులుండటంతో వారి స్థాయిలో భూ సమస్యలు, దస్త్రాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. తహసీల్దారు, ఆర్డీవోలకు కొన్ని అధికారాలు అప్పగిస్తే కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గుతుందని, సమస్యల పరిష్కారంలో వేగమూ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ధరణి పోర్టల్ ఐచ్ఛికాల్లో కీలక మార్పులు - భూ సమస్యలన్నింటికీ ఒకే అర్జీ ఉండాలన్న కమిటీ
Telangana Govt Transfer of Dharani Powers : ఇందుకు రెవెన్యూ చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉందా లేక ఉత్తర్వు ద్వారానే ఈ పద్ధతిని మార్చవచ్చా అనే అంశంపై వారు దృష్టి పెట్టారు. యాజమాన్య హక్కుల కల్పన, సవరణలన్నీ కలెక్టర్లు చేస్తున్నా తుది దస్త్రంపై తహసీల్దార్ల సంతకాలే వస్తున్నాయి. ఈ క్రమంలోనే విధులు బదిలీ చేస్తే సరిపోతుందని, దీనికి శాఖ అంతర్గత ఆదేశాలు చాలని పలువురు సీనియర్ అధికారులు సూచించినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో దీనిపై తెలంగాణ సర్కార్ (Telangana Govt) తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
'ధరణి' సాఫ్ట్‌వేర్‌తో పాటు చట్టాలు మార్చాల్సిందే - కమిటీ ప్రాథమిక అభిప్రాయం
పెండింగ్ తక్కువ చూపేందుకు తిరస్కరణ! : ధరణి (Dharani Portal) ప్రారంభమైన 2020 అక్టోబరు 29 నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు పోర్టల్‌కు 16.57 లక్షల అర్జీలు వచ్చాయి. వాటిలో 2.40 లక్షల దరఖాస్తులను పెండింగ్‌లో చూపుతున్నారు. ఇప్పటివరకు 6.38 లక్షల అర్జీలనే పరిష్కరించారు. తిరస్కరణకు గురైనవి 5.37 లక్షలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసిన ప్రతిసారీ కొన్ని జిల్లాల్లో తక్కువ దరఖాస్తులే పెండింగ్‌లో ఉన్నాయని చూపేందుకు ఎడాపెడా తిరస్కరించేవారని రెవెన్యూవర్గాల తెలుస్తోంది. దరఖాస్తుల్లో చిన్న తప్పున్నా, ఆధారాలు లేకపోయినా తిరస్కరించిన దాఖలాలు కోకొల్లలు. తెలంగాణ సర్కార్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన క్రమంలో తిరస్కరించిన అర్జీల్లోనూ అర్హత ఉన్నవాటికి మోక్షం కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.
పాసుపుస్తకాల్లోని పొరపాట్లు సరిదిద్దడంలోనూ జాప్యమే :
- పాసుపుస్తకాల్లో పేర్లు, సర్వే విస్తీర్ణం, ఖాతా సంఖ్య, చిరునామా, ఆధార్ నంబర్ లాంటివి తప్పుగా నమోదు కాగా వాటిపై వచ్చిన దరఖాస్తుల్లో 2.43 లక్షల అర్జీలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.
- వీటి పరిష్కారంలో జాప్యానికి క్షేత్రస్థాయి విచారణ ఒక కారణమైతే కలెక్టరేట్లలో సిబ్బంది ఉదాసీన వైఖరి కూడా కొంతమేరకు కారణమని బాధితులు అంటున్నారు.
- ధరణి ప్రారంభం నుంచి భూ సంబంధిత సమస్యలపై 4.30 లక్షల అర్జీలు రాగా తిరస్కరించినవి పెద్దసంఖ్యలో ఉన్నాయి.
- సాగు భూములను కూడా సాగేతర భూములుగా తప్పుగా నమోదు చేశారంటూ దాఖలైన వాటిలో 25 శాతం పెండింగ్‌లో ఉన్నాయి.
- ఎప్పుడో వ్యవసాయేతర భూమిగా మారగా ఇప్పటికీ సాగుభూమిగా చూపుతున్నారంటూ దాఖలైనవి 32.44 శాతం, మైదాన ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు 22.72 శాతం పెండింగ్‌లో ఉన్నాయి.