Desaipalli Oustees Compensation Issue : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద బాహుబలి మోటార్లతో నిర్మించిన పంప్‌హౌస్ ద్వారా మిడ్ మానేరుకు అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు గత ప్రభుత్వం పలుమార్లు సర్వే నిర్వహించింది. కాలువ నిర్మాణంతో ముంపునకు గురవుతున్న దేశాయపల్లి నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్, ఇళ్ల పరిహారం రావాల్సి ఉంది. విలాసాగర్, మర్లపేట, రత్నంపేట, రాజన్నపేటకు చెందిన రైతులు భూములు కోల్పోతున్నారు. కొందరు రైతులకు పరిహారం రాగా మరి కొంతమందికి వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. తమకు పరిహారం చెల్లిస్తారా లేదా? అని నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
నిర్వాసితులుగా మారుతున్న 144 కుటుంబాలు : కాలువ నిర్మాణంలో దేశాయపల్లిలో ఇళ్లు కోల్పోతున్నవారికి పరిహారం అందించడంలో భాగంగా రెండేళ్ల క్రితం సర్వే నిర్వహించారు. దాదాపు 144 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నాయి. ఒక్కో కుటుంబానికి 75 చదరపు గజాల ఇంటి స్థలానికి 6లక్షల 60 వేలు పరిహారంతో పాటు కొత్త ఇంటి నిర్మాణానికి లక్షా 25 వేలు చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. నిర్వాసితుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదనపు టీఎంసీ కాలువకు భూసేకరణ చేస్తారా? లేదా నిలిపివేస్తారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
"కాలువ పనులు జరుగుతాయా? లేదా? మా పరిహారానికి సంబంధించిన నిధులు వచ్చాయన్నారు? వాటి పరిస్థితి ఏమిటి? అనే విషయాల్లో స్పష్టత లేదు. ఏదైనా చేసుకుందామంటే మొత్తం భూములు లాక్‌లో పెట్టారు. భూ సేకరణ చేస్తారా లేదా అనే అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వండి" - నిర్వాసితులు
స్పష్టత ఇవ్వాలని కోరుతున్న నిర్వాసితులు : భూసేకరణ చేయడానికి వరదకాలువ సమీపంలో 11 ఎకరాలు పీఎన్ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురించారు. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ఒకేసారి ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షలు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం చెల్లించాలని కొంత మంది నిర్వాసితులు జిల్లా కలెక్టర్, తహసీల్దారు కార్యాలయాల్లో వినతి పత్రాలను అందించారు. దీనిపై నిర్వాసితుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు సర్కార్ మారడం కాళేశ్వరంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో భూసేకరణ కొనసాగుతుందా నిలిపివేస్తారా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
15 ఏళ్లు అయినా అందని పరిహారం - రేవంత్ సర్కార్‌పైనే బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల ఆశలు