Dasara Celebrations in Vijayawada 2024 : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడోరోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.ఈ క్రమంలోనే దుర్గమ్మను దర్శించేకునేందుకు మంత్రులు ఏపీ మంత్రులు వచ్చారు. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.
Pawan Kalyan Visit Indrakeeladri : మొదట ఆలయం వద్ద అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. పవన్‌తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ జగన్మాతను దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే దుర్గమ్మకు ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం పూర్వజన్మ సుకృతమని భక్తులందరికీ జగన్మాత దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.
2 లక్షల మంది వస్తారని అంచనా : ఇవాళ మూలా నక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. టికెట్ దర్శనాలను రద్దు చేసి వేకువజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు. నేడు 2లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
సరస్వతీదేవి అధిష్ఠాన దేవత : దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉందని ఆలయ పండితులు యనమండ్ర ఉమాకాంత శర్మ తెలిపారు. నరుణ్ణి నరోత్తముడిగా చేసి, నారాయణ తత్త్వాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు అమ్మను ఆరాధన చేస్తారని అన్నారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు అన్నిటికీ సరస్వతీదేవి అధిష్ఠాన దేవత అని అన్నారు. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయని అన్నారు. కచ్ఛపి అనే వీణ పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, నెమలిని అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుందని తెలిపారు. అనంత స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకదాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయన్నారు.
తిరుమలలో తన చిన్న కుమార్తెతో కలిసి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - PAWAN KALYAN VISIT TIRUMALA