Deputy CM Bhatti Review On Solar Energy : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీనీ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు వెంటనే ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంపుదల, వివిధ వర్గాలకు ఆదాయం సమకూర్చడంపై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో 22 ప్రత్యేక గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల వ్యవసాయ పంపుసెట్లకు సంపూర్ణంగా ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పవర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా వచ్చే విద్యుత్తును పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీని ద్వారా రైతులకు పంటలపై ఆదాయమే కాకుండా ప్రతి ఏటా సోలార్ పవర్ ద్వారా రైతులకు వ్యక్తిగతంగా నిర్దిష్టంగా ఆదాయం సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతోపాటు 22 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద గృహాలకు సంతృప్త స్థాయిలో (సాచ్యురేషన్) ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
డ్వాక్రా సంఘాలకు సోలార్ ఉత్పత్తి కేంద్రాలు : ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లితో పాటు, మధిర నియోజకవర్గంలోని సిరిపురం ఇలా మరో 20 గ్రామాలను రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసుకొని ముందుకు పోవాలని ఆదేశించారు. సోలార్ పవర్‌తో ఆయా గ్రామస్తులకు ఆదాయాన్ని సమకూర్చడమే ప్రభుత్వం ప్రధాన ఆలోచన అని వివరించారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలకు ఐదు నుంచి పది మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవడానికి వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు.
సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు నుంచి రుణాలు సైతం ఇప్పించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్తును ప్రభుత్వమే బై బ్యాక్ పద్ధతిలో కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ ఎనర్జీ దోహదపడుతుందని తెలిపారు.
Green Energy Production in Telangana : మహిళలను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ సంకల్పం అని అన్నారు. మొత్తంగా గ్రీన్ ఎనర్జీ ద్వారా పల్లెల్లో రైతులకు, పేదలకు స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర విద్యుత్తు అవసరాలు సైతం పూరించే అవకాశం లభిస్తుందని, వివిధ వర్గాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అధికారులకు తెలిపారు.
భాగ్యనగరానికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు - 2028 నాటికి 34 లక్షల ఉద్యోగాలు - GCCs in Hyderabad