Bhatti and Tummala on Crop Loan Waiver with Bankers : రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం బలోపేతం విషయంలో లెక్కలు కాదు ఆత్మపరిశీలన ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకం కోసం 18 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చేర్చామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రైతులకు మాత్రం నేటి వరకు 7500 కోట్ల రూపాయలు మాత్రమే చేరాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Attended the State Level Bankers Committee meeting at Mahatma Jyotiba Poole Praja Bhavan today. I emphasized the need for banks to expedite the loan waiver process for our farmers, ensuring that those with loans up to 2 lakhs receive relief swiftly and without any hurdles.
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 20, 2024
Our… pic.twitter.com/9In8UGAQoB
ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాలు, గత ఏడాది సాధించిన పురోగతి, రుణమాఫీ పథకం కింద నిధుల కేటాయింపులు వంటి అంశాలపై చర్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రాధాన్యత రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరు కనపరచడం పట్ల భట్టి సంతోషం వ్యక్తం చేశారు. మొదటి త్రైమాసికంలోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకుల్లో 40.62 శాతం వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యం సాధించడం అభినందనీయమన్నారు.
రాష్ట్రానికి వెన్నెముకగా వ్యవసాయ రంగం : రాష్ట్రం నగదు నిల్వల నిష్పత్తి మొదటి త్రైమాసికంలో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశమని భట్టి విక్రమార్క తెలిపారు. రాబోయే త్రైమాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆశిస్తున్నానంటూ దిశానిర్దేశం చేశారు. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా ఆయిల్‌పామ్ సాగుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన క్రమంలో ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తున్న సర్కారు, రుణమాఫీ, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో బృందం అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి 36 వేల కోట్ల రూపాయల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్పుకొచ్చారు.
రుణ ఖాతాల్లో తప్పులు సరిదిద్దాలి : ఈ వర్షాకాలంలో అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని ఆశిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసిన దృష్ట్యా కింది స్థాయిలో పనిచేసే బ్రాంచ్ మేనేజర్లు రుణ ఖాతాల్లో తప్పులు సరిదిద్దేటట్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా పూర్తి చేయడానికి బ్యాంకుల సహకారం కావాలని మంత్రి తుమ్మల అన్నారు. అంకెలు చదువుకొని మూడు నెలలకోసారి సమావేశాలు పెట్టడం వల్ల బ్యాంకర్ల సదస్సు నిర్వహణకు అర్ధం లేదని, అవి అంతిమ వినియోగదారుల ప్రయోజనాలు, నిమ్న వర్గాలు, లక్షిత వర్గాలకు ఆర్థిక ఫలాలు చేరేలా చేయాలని తుమ్మల పేర్కొన్నారు.