Demand in Panchadara Chilakalu : గ్రామాల్లో తీర్థాలు మొదలయ్యాయి. ఈ సంబరాలు ప్రతివారిని ఆనందోత్సాహాలతో నింపుతాయి. వీటిలో పల్లెవాసుల సంప్రదాయ వంటకమైన పంచదార చిలకలకు ఈ సీజన్‌లో డిమాండ్ చాలా ఎక్కువ. పిల్లల నుంచి పెద్దలవరకు వీటిని చూసి ముచ్చటపడని వారుండరు. అనకాపల్లి జిల్లాలో వడ్డాది, చోడవరం, కశింకోట గ్రామాల్లో వీటిని తయారుచేసే కుటుంబాలు ఉన్నాయి. కశింకోట వడ్డివీధికి చెందిన కొన్ని కుటుంబాలు దశాబ్దాలుగా పిండి వంటలు తయారుచేసి సంతల్లో, సంబరాల్లో విక్రయిస్తుంటారు.
సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి పంచదార చిలకల తయారీలో నిమగ్నమవుతారు. వీటిలో గులాబీ, తెలుపు రంగులకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో వీటినే తయారు చేస్తుంటారు. వీటి తయారీకి ప్రధానంగా పంచదారను వినియోగిస్తారు. కట్టెల పొయ్యిపై పాకం తీసి అచ్చుల్లో వేసి చల్లారుస్తారు. అచ్చుల నుంచి జాగ్రత్తగా వీటిని విడదీసి బయటకు తీస్తారు. వీటిని పదిలంగా బుట్టల్లో పేర్చి అమ్మకానికి సిద్ధం చేస్తారు.
కేజీ పంచదారకు పరిమాణాన్ని బట్టి 40 చిలకల వరకు తయారు చేస్తారు. ఒక్కో దాని ధర పది నుంచి వంద వరకు ఉంటుంది. ఉపనయనాలు, బారసాల, వివాహాలు తదితర వేడుకలకు చిలకలను తయారు చేయడం వీరి ప్రత్యేకత. మరోవైపు ఏళ్ల తరబడి తమ పరిస్థితులు మారలేదని, ముడి సరకుల ధరలు పెరగడంతో ఆశించిన లాభాలు పొందలేకపోతున్నామని తయారీదారులు ఆవేదన చెందుతున్నారు.
రుణాలు ఇవ్వాలి : చిరు వ్యాపారులకు ఇచ్చే విధంగా మాకు కూడా రుణాలు ఇస్తే మేలు కలుగుతుందని చిలకల తయారీదారు ఆకుల రమణమ్మ తెలిపారు. గిట్టుబాటు కాకపోయినా తాతల కాలం నాటి వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆమె చెప్పారు.
రాయితీపై పంచదార అందించాలి: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయం లేక అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నామని కశింకోటకు చెందిన ఆకుల లక్ష్మణరావు పేర్కొన్నారు. ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తే కొంత భారం తగ్గుతుందని చెప్పారు. 50 కేజీల పంచదార బస్తా కొనుగోలు చేయడానికి కూడా చేతిలో డబ్బులు లేవని వాపోయారు. ప్రభుత్వం సంప్రదాయ వంటలను ప్రోత్సహించేలా రాయితీపై పంచదార అందించాలని ఆయన కోరారు.