Delhi Man Took 200 Flights in 110 Days To Steal Jewelry : కేవలం 110 రోజులు దేశవ్యాప్తంగా దాదాపు 200 విమానాల్లో ప్రయాణించాడంటే అతడేదో బిజినెస్మెన్ లేకపోతే సినీ సెలబ్రేటీ షూటింగ్‌లతో బిజీబిజీగా తిరుగుతున్నారని అనుకుంటున్నారేమో? కానీ ఈ రెండు కాదు. ఇంత బిజీగా దేశంలోని నగరాలు చుట్టేస్తున్న ఆ వ్యక్తి ఓ దొంగ అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? అవునండీ దిల్లీకి చెందిన ఆ గజదొంగ కేవలం విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడ.
హైదరాబాద్ నుంచి దిల్లీకి ప్రయాణించిన మహిళ హ్యాండ్‌బ్యాగులో విలువైన ఆభరణాల చోరీ కేసులో దర్యాప్తు మొదలుపెట్టిన దిల్లీలోని పహర్‌గంజ్ పోలీసులు నిందితుడిని తాజాగా అరెస్టు చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు విస్తుపోయారు. దిల్లీలోని పహర్‌గంజ్‌కు చెందిన రాజేశ్ కపూర్ గతంలో మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారంతో పాటు సెల్‌ఫోన్ రిపేరింగ్ దుకాణాన్ని నడిపేవాడు. అక్కడ వచ్చే ఆదాయం చాలక దొంగగా మారాడు. మొదట్లో రైళ్లలో చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కగా, జైలు నుంచి వచ్చి రూట్‌ను మార్చాడు.
విమాన ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని దోపిడి పాల్పడటం షురూ చేశాడు. ప్రధానంగా కనెక్టింగ్ ఫ్లైట్లలో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకుని దోచేస్తుంటాడు. సామగ్రి సర్దుతున్నట్లు నటిస్తూ లేదా టాయిలెట్‌కి వెళ్లినప్పుడు విలువైన వస్తువులను చోరీ చేస్తాడు. కేవలం 2023లో చోరీల కోసం ఏకంగా 110 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించాడని పోలీసులు సాంకేతిక వివరాలు ఆధారంగా గుర్తించి షాకయ్యారు.
పట్టించిన ఆ రెండు ఫిర్యాదులు : ఏప్రిల్ 11న హైదరాబాద్ నుంచి దిల్లీ వెళుతున్న మహిళ బ్యాగులో ఉన్న రూ.7 లక్షలు చోరీ చేశాడు. అలాగే ఫిబ్రవరి 2న అమృత్సర్నుంచి దిల్లీకి విమానంలో ప్రయాణించిన వ్యక్తి బ్యాగులోని రూ.20 లక్షల విలువైన వస్తువులు దొంగలించాడు. ఈ చోరీపై బాధితుడు దిల్లీలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు దిల్లీ, హైదరాబాద్, అమృత్సర్ తదితర విమానాశ్రయాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒకే వ్యక్తి మూడు చోట్ల అనుమానాస్పదంగా కనిపించడం చూశారు. సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని దిల్లీలోని పహర్గంజ్లో అరెస్టు చేశారు.
హైదరాబాదీల సొత్తే రూ.కోటి దోపిడి : హైదరాబాద్ నుంచి దిల్లీ రాకపోకలు సాగిస్తున్న క్రమంలో ఇద్దరు ప్రయాణికుల సొత్తును చోరీ చేశానని నిందితుడు అంగీకరించాడు. ఒకదాంట్లో సుమారు రూ.52 లక్షల విలువైన ఆభరణాలు, నగదును చోరీ చేశాడు. జూబ్లీహిల్స్ ఠాణాలో దీనిపై కేసు నమోదు అయింది. మరోవైపు శంషాబాద్ నుంచి దిల్లీ వెళుతున్న ప్రయాణికుల నుంచి సుమారు రూ.50 లక్షల సొత్తు చోరీ చేశాడు. దీనిపై ఆర్జీఐఏ ఠాణాలో కేసు నమోదు అయింది. అయితే ఈ సొత్తును ఇక్కడే నిందితుడు కాజేసినట్లు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ దిల్లీలో కాజేసినట్లు నిందితుడు అంగీకరించడంతో ఆర్జీఐఏ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దిల్లీలోని పహల్గంజ్ ఠాణాకు బదిలీ చేశారు. నిందితుడికి రిక్కీ డీలక్స్ పేరుతో ఒక అతిథి గృహం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మహిళను గొంతు నులిమి చంపడానికి దొంగ యత్నం- పర్సు, ఫోన్‌తో పరార్
పోలీసులనే ఆశ్చర్యపరిచిన స్పైడర్ మెన్ దొంగ - ఏకంగా 4 కిలోల బంగారం చోరీ