Judgment Reserved on Kavitha's Bail Petitions : సీబీఐ, ఈడీ నమోదుచేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ తెలంగాణ బీఆర్ఎస్ నేత కవిత దాఖలు చేసిన పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు మంగళవారం ఈడీ న్యాయవాది జోయెబ్ హుస్సేన్ ఈమేరకు వాదనలు వినిపించారు. కవిత సాధారణ గృహిణికాదని, ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి కుమార్తె అని పేర్కొన్నారు. విదేశాల్లో ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేసి వచ్చి రాజకీయాల్లో ఉన్నత స్థానాలు చేపట్టిన వ్యక్తి అని గుర్తుచేశారు.
MLC Kavitha Bail Petition Update : సాక్షులను బెదిరించడంతోపాటు, సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేశారని, అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైలని బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకొనేలా కవిత ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో కవిత బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఈ కేసులో ఆమె పాత్ర గురించి 2022 నవంబర్‌లో ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని 118 రోజుల తర్వాత ఉపసంహరించుకున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు.
ఈడీ తనను బెదిరించి, అనుచితంగా వ్యవహరించి వాంగ్మూలం నమోదుచేసిందని చెప్పి ఆయన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారని న్యాయవాది పేర్కొన్నారు. ఆయన ఈడీ ముందు చాలా వాంగ్మూలాలు ఇచ్చినా అందులో కేవలం కవిత పేరు ప్రస్తావించిన వాంగ్మూలాన్ని మాత్రమే ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం వెనక కవిత పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
దిల్లీ మద్యం వ్యాపారం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసు : ఈడీ - Kavitha Bail Petitions Update
సాక్షులను బెదిరించి సాక్ష్యాలను చెరిపేశారు : ఈ కుంభకోణం సాగిన 10 నెలల్లో హోల్‌సేల్ వ్యాపారులు మొత్తం రూ. 338 కోట్లు నేరపూరితంగా ఆర్జించారని తెలిపారు. అందులో ఇండో స్పిరిట్ సంస్థకు ఒక్కదానికే రూ. 192 కోట్లు దక్కిందన్నారు. ఇదే సంస్థలో అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉంటూ ఆమె తరఫున రూ.32 కోట్లు పొందారని పేర్కొన్నారు. ఈ విషయం బుచ్చిబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని వివరించారు. ఆ రూ. 32 కోట్లలో నాలుగున్నర కోట్లు కవిత నేతృత్వంలో నడుస్తున్న ఇండియా అహెడ్ సంస్థకు వెళ్లాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాట్సప్ చాట్స్ ఉన్నాయన్నారు.
కవిత గతేడాది మార్చి 21వ తేదీన తొమ్మిది ఫోన్లు దర్యాప్తు సంస్థ అధికారులకు అప్పగించారని అందులో నాలుగు ఫోన్లు మార్చి 14, 15 తేదీల్లో ఫార్మాట్ చేసి ఉన్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఉందన్నారు. ఇలా సాక్ష్యాలను చెరిపేశారన్న కారణంతోనే కింది కోర్టు బెయిల్ తిరస్కరించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించి ఆమెను తాము అరెస్టు చేశామన్న వాదనల్లోనూ ఎలాంటి నిజంలేదని వచ్చే పది రోజులు ఆమెకు సమన్లు జారీచేయబోమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ 15న ఏఎస్జీ రాజు సుప్రీంకోర్టుకు చెప్పారని, అంతే తప్ప అరెస్టు చేయబోమని చెప్పలేదని పేర్కొన్నారు.
దిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు : సీబీఐ తరఫు న్యాయవాది ఇదే తరహా వాదనలు వినిపించి ఆమె బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈ వాదనలను కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా తోసిపుచ్చారు. ఈకేసులో రూ. 192 కోట్ల నేరపూరిత ఆర్జన జరిగినట్లు చెబుతున్నారని, అందులో ఒక్కపైసా కూడా కవితకు చేరలేదన్నారు. బుచ్చిబాబు ఈ కేసులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నా ఇంతవరకు ఆయన్ను ఈడీ అరెస్టే చేయలేదని గుర్తుచేశారు.
తాము ఫోను ధ్వంసం చేసినట్లు 2023 మార్చిలోనే తెలిసినప్పటికీ అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేయాలనుకుంటే తన ఫోన్లను తన దగ్గర పనిచేసే వారికి ఇవ్వడానికి బదులు వాటిని ధ్వంసం చేసి ఉండేవారన్నారు . అలా కాకుండా ఆమె తన పాతఫోన్లను ఉద్యోగుల నుంచి సేకరించి ఇచ్చారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌చేశారు. ఈనెల 30, 31 తేదీల్లో ఏదో ఒక రోజున వెలువరించనున్నట్లు వెల్లడించారు.