Deficit Rainfall in Six Districts of Telangana : రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత నెలలో అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడ్డాయి. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 131.4 మి.మీ. కాగా, సగటున 17 శాతం అధిక వర్షపాతం (153.5 మి.మీ.) నమోదైంది. అయినప్పటికీ మాత్రం 6 జిల్లాల్లో తీవ్రమైన లోటు నెలకొంది. మరో 8 జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే వర్షాలు పడ్డాయి.
143 మండలాల్లో తీవ్రమైన లోటు: రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 143 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాలు, రంగారెడ్డిలో 27 , నిజామాబాద్‌లో 29, సంగారెడ్డిలో 27, వికారాబాద్ జిల్లాలోని 19, కామారెడ్డిలో 23 మండలాలు లోటును ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో వర్షాలు పడిన మెుదట్లోనే రైతులు మొక్కజొన్న, పత్తి, మొదలగు పంటలకు విత్తనాలు వేశారు. కాగా లోటు వర్షపాతం రైతుల పాలిట శరాఘాతంలా మారింది. నాటిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో, వాటిస్థానంలో మరోసారి విత్తనాలు నాటిన రైతులు, వర్షాల రాకకోసం నింగివైపు చూసే పరిస్థితులు నెలకొంది.
- ఎనిమిది జిల్లాల పరిధిలోని 138 మండలాల్లో సాధారణ స్థాయిలో (సాధారణ వర్షపాతానికి 19 శాతం అటూ ఇటూ)గా వర్షాలు కురిశాయి.
- 6 జిల్లాల్లోని 147 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
- మిగిలిన 13 జిల్లాల్లోని మండలాల్లో సాధారణం కన్నా 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదయింది.
వాతావరణం చల్లబడనేలేదు: జూన్ రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు కొంత అధికంగా కొనసాగడం సాధారణం. ఈసారి జూన్ మూడో వారం వరకు ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. నైరుతి రుతుపవనాల ద్వారా మంచి వర్షాలు కురవాల్సి ఉండగా, అడపాదడపా వర్షాలు మాత్రమే ఇందుకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో నైరుతి విస్తరణ నెమ్మదిగా జరగింది. దీంతో దక్షిణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, తుపాన్లు ఏర్పడలేదని ఐఎండీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి విస్తరణ పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో చల్లని వాతావరణం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది.
ఆశాజనకంగా జులై: జులై నెల ఆశాజనకంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి ఈటీవీ భారత్కు తెలిపారు. మొదటి వారం అనంతరం నుంచి మంచి వర్షాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అరేబియా మహాసముద్రం నుంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ సారి సాధారణం కన్నా అధికంగా వర్షాలు నమోదవుతాయని ఆమె తెలియజేశారు.
ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు - మండుతున్న కూరగాయల ధరలు - rise in prices of vegetables