Cyclone Remal Effect on Andhra Pradesh: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో తుపానుగా మారి అనంతరం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపానుకు 'రేమాల్'గా నామకరణం చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. తుపాను ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశముందని వెల్లడించారు.
ఒడిశా, బంగాల్, బంగ్లాదేశ్‌పై తుపాను ప్రభావం చూపుతుందని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని హెచ్చరించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు సునంద తెలిపారు. ఈ రేమాల్ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు. తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించినట్లు వెల్లడించారు.
బంగాళాఖాతంలో అలజడి- అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక - RAIN ALERT
బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, రేపు ఉదయానికి తుపానుగా మారుతుందని విపత్తుల సంస్థ తెలిపింది. రేపు రాత్రికి తీవ్ర తుపానుగా బలపడుతుందని, ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంది. అయితే తుపాను ప్రభావం వలన రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అదే విధంగా విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది. రైతులు, కూలీలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది.
కురుస్తున్న వర్షాలు : కాకినాడలో గంటన్నరకు పైగా కుండపోత వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెయిన్ రోడ్, సినిమా రోడ్, దేవాలయం రోడ్ రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. కలెక్టరేట్ ప్రాంగణాన్ని వర్షం నీరు ముంచెత్తింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది. సాంబమూర్తి నగర్ దుమ్ములపేట డైరీ ఫార్మ్ సెంటర్ లలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. భారీ వర్షంతో చిరు వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన అమ్ముకునే పళ్లు, ఇతర వస్తువులు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. కొన్ని వాన నీటిలో కొట్టుకుపోయాయి. భాస్కర్ నగర్ గోదారిగుంట సురేష్ నగర్, పోస్టల్ కాలనీ వెంకట్ నగర్ తదితర జనావాస కాలనీలను వాన నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి. రహదారుల్ని ముంచేశాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చల్లబడిన వాతావరణం - రాష్ట్రంలో మరో మూడు రోజులుపాటు వర్షాలు - AP Weather Report