Cyberabad CP Avinash Mahanthi Suspended Miyapur CI : మహిళతో దురుసుగా ప్రవర్తించిన తీరుపై మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్‌పై వేటు పడింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సీఐ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనతో సీఐ ప్రేమ్ కుమార్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆ మహిళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపించిన సీపీ సీఐ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీచేశారు.
Police Transfer And Suspension In Telangana : నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో బదిలీల వేటు పడింది. వివిధ విషయాల్లో జోక్యం చేసుకున్న పోలీసులపై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. పోలీసు శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై గట్టి నిఘా పెట్టింది. ఆయా పోలీస్ స్టేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కూడా సమగ్ర విచారణ చేపట్టి సస్పెండ్ వేటు వేస్తున్నారు.
గత ఫిబ్రవరి 1న గోపాలపురం ఇన్‌స్పెక్టర్ మురళీధర్, ఎస్సై దీక్షిత్‌రెడ్డిలను నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఇన్‌స్పెక్టర్ మురళీధర్, ఎస్సై దీక్షిత్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశారు.
CI Arrest in MLA Shakeel Son Case : మరోవైపు మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు సహకరించిన సీఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో సీఐ దుర్గారావు పరారీలో ఉన్నారు. తాజాగా ఈ నెల 5న సీఐ దుర్గారావును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పట్టుకున్నారు. ఆయనను డీజీపీ కార్యాలయంలో విచారణ చేసిన అనంతరం అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Panjagutta PS Transfers 2024 : ఇటీవల హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పోలీసుల బదిలీలపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఒక్కరోజులో మొత్తం 86 మంది పోలీసుల సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొంతకాలంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఒకే స్టేషన్‌లో 86 మందిని బదిలీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు - పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్
రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ - టీఎస్పీఎస్సీ నూతన కార్యదర్శిగా నవీన్ నికోలస్