Cyber Crimes in Andhra Pradesh : మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్‌లో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కస్టమ్స్ విభాగం అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ ఫోన్లో భయపెట్టి సైబర్ నేరగాళ్లు సొత్తు కాజేస్తున్నారు. 'మేం పలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం. మీ క్రెడిట్, డెబిట్ కార్డులు అప్‌గ్రేడ్ చేయాలి. లేకపోతే బ్లాక్ అయిపోతాయని చెబుతూ' వాటిపై ఉన్న సీవీవీ నంబర్, ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరిట, ఈ-కేవైసీల పేరిట, న్యూడ్ వీడియోకాల్స్ ద్వారా మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు.
Cyber Fraud Cases in AP : ఇవన్నీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను విశ్లేషించినప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో సైబర్ నేరగాళ్లు రూ.940 కోట్లు కొల్లగొట్టగా వారి నుంచి పోలీసులు రూ.8.26 కోట్లే తిరిగి రాబట్టగలిగారు. అంటే రికవరీ కేవలం 0.87 శాతమే. మరో రూ.140.40 కోట్లు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేయించారు. నేరగాళ్లు వేర్వేరు దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ మోసాలకు తెగబడుతుండటంతో వారిని పట్టుకోవటడం, సొమ్మును రికవరీ చేయటం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది.
వైఎస్సార్సీపీ హయాంలో 9,849 సైబర్ నేరాలు : వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు పూర్తిగా ప్రతిపక్షాలపై వేధింపులు, అక్రమ కేసుల బనాయింపు, ఇతర రాజకీయ పోలీసింగ్ విధులకే పరిమితమయ్యారు. దీంతో సైబర్ నేరాల దర్యాప్తుపై దృష్టి సారించిన పరిస్థితి లేదు. దీంతో సైబర్ నేరాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. 2014-18 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్రంలో 3,572 సైబర్ నేరాలు నమోదు కాగా, 2019-23 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో 9,849 కేసులు నమోదవడం గమనార్హం.
రాష్ట్రంలో జరిగే చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు రూ.150 కోట్ల మేర సొత్తు నేరగాళ్లు కొల్లగొడుతుంటారు. అందులో 50 నుంచి 60 శాతం సొత్తును పోలీసులు తిరిగి రాబట్టగలుగుతున్నారు. అదే సైబర్ నేరాల్లో మాత్రం ఏటా సగటున రూ.313 కోట్ల మేర కొల్లగొడుతుండగా అందులో కనీసం ఒక్కటంటే ఒక్క శాతమైనా తిరిగి రాబట్టలేని పరిస్థితి నెలకొంది.
సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్‌లైన్ డే : సైబర్ నేరాలు ప్రధాన సమస్యగా మారుతున్న నేపథ్యంలో వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సైబర్ కమాండోలను సిద్ధం చేయనుంది. విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ పౌరులుగా తీర్చిదిద్దనుంది. సైబర్ నేరాల ఛేదన కోసం దర్యాప్తు అధికారుల్లో నైపుణ్యం, సామర్ధ్యాలు పెంచేలా శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేకంగా సైబర్ ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదుల స్వీకరణకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్‌లైన్ డే ను నిర్వహించనుంది.
రోజుకో ముసుగులో సైబర్ వల - లింక్స్‌పై క్లిక్ చేశారో అంతే ! - APK File Phone Hacking Cyber Fraud
ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud