MATRIMONIAL FRAUD IN HYDERABAD : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు రాష్ట్రంలో సైబర్‌నేరాలు పెరుగుతున్నాయి. ప్రజలకు సైబర్‌నేరాల పట్ల పోలీసుశాఖ ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు అందమైన అమ్మాయిల ఫొటోలతో ఫేక్ ప్రొఫైళ్లు సృష్టించి యువతపై ప్రేమ, పెళ్లి పేరుతో ఆశలు రేపుతున్నారు. నమ్మిన బాధితుల వద్ద నుంచి డబ్బును కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో జరిగింది. స్నాప్‌చాట్‌లో యువతి పేరిట ఖాతా తెరిచి బాధితుడి నుంచి రూ.14 లక్షలు కాజేసిన నేరగాడిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మరం అశోక్ రెడ్డి అనే యువకుడు స్నాప్‌చాట్‌లో ప్రణీత రెడ్డి పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బాధితుడికి మెసేజ్ చేశాడు. మెల్లగా చాటింగ్‌లో మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ నమ్మబలికాడు. అర్జెంట్‌గా డబ్బు అవసరం అని చెప్పి వెంటనే పంపించాలని చెప్పి కోరాడు. మరికొంతకాలానికి వ్యాపారం పేరిట బాధితుడి నుంచి డబ్బులు కాజేశాడు. వారు మోసపోయామని బాధితుడికి తెలవనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. తనతో స్నాప్‌చాట్‌లో చాటింగ్ చేస్తున్నది అమ్మాయి కాదని తెలుసుకున్న యువకుడు ఖంగుతిన్నాడు.
మీ మొబైల్‌కు ఏవైనా అనుమానాస్పద లింకులు వచ్చాయా - వెంటనే ఈ నంబర్‌కు వాట్సాప్ చేసేయండి
Matrimonial Fraud in Hyderabad : తాను సైబర్‌నేరగాడి చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితుడి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.14 లక్షలు కాజేసినట్లుగా గుర్తించారు. వాటిని బెట్టింగ్‌ల కోసం ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడు ఆ సొమ్మును సిల్వర్ బెట్777.కామ్, తీన్పట్టీ గోల్డ్‌లాంటి పలు గేమింగ్ యాప్‌లలో ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై 419,420,506 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి చరవాణి, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో స్కామర్ లను గుర్తిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని, అపరిచితులను నమ్మకూడదని సైబర్‌క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
డీజీపీ ఫొటోతో వాట్సాప్ డీపీ - డబ్బులు డిమాండ్ చేస్తూ సైబర్ కేటుగాళ్ల బెదిరింపులు