Cyber Crimes: సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడొద్దని అధికారులు అభయం ఇస్తున్నా ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. అరెస్టు చేస్తామనగానే లక్షల రూపాయల డబ్బులు చెల్లించేస్తున్నారు. అలాగే తక్కువ పెట్టుబడులకు అధిక ఆదాయం ఇప్పిస్తామని చెప్పిన వెంటనే నమ్మేస్తున్నారు. ఇలా నిలువునా మోసపోతున్నారు. ఇలాంటి తరహా ఘటనలపై తాజాగా విజయవాడ సైబర్ క్రైం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.
కొరియర్‌లో డ్రగ్స్: మాచవరం కార్మికనగర్‌కు చెందిన ఓ యువతి (24) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి దిల్లీ ఫెడెక్స్ కొరియర్ నుంచి అని పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరుతో వచ్చిన పార్శిల్‌లో 3 క్రెడిట్ కార్డులు, 2 డెబిట్ కార్డులు, 5 కిలోల మందులు, 450 ఎండీఎంఏ డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టాడు. అరెస్టు చేస్తామంటూ మాటల్లో పెట్టి ఆమె ఆర్థిక లావాదేవీలు తెలుసుకున్నారు. తర్వాత డబ్బులు పంపించమని బెదిరించడంతో ఆమె భయపడిపోయింది.
రెండు అకౌంట్లకు 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 20 లక్షల రూపాయలు పంపింది. తర్వాత ఆమె బ్యాంకు అకౌంట్, లాగిన్ ఇతర వివరాల ద్వారా ఆమె పేరుతో 4.45 లక్షల రూపాయల ఇన్‌స్టంట్ రుణం తీసుకుని నిందితులు తమ అకౌంట్లకు మళ్లించుకున్నారు. దీనిపై ఆమె సైబర్ క్రైం పోర్టల్‌కు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫేస్‌బుక్‌లో ప్రకటన చూసి: విజయవాడలోని భారతీనగర్‌కు చెందిన సదరు వ్యక్తి (49) 2024, సెప్టెంబరు 23వ తేదీన ఫేస్‌బుక్‌లో అధిక ఆదాయం అనే ప్రకటన చూశారు. దాన్ని క్లిక్ చేయగానే ‘SBI క్యాప్ సెక్యూరిటీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌నకు కనెక్ట్ అయింది. తొలుత ఓ మహిళ ఫోన్ చేసి పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందని చెప్పింది. దీంతో ఆయన 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. దానికి ఆదాయం రావడంతో ఆకర్షితులయ్యారు. వారి మాటలు నమ్మి విడతల వారీగా 66 లక్షల 34 వేల 567 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అకౌంట్లో అధిక ఆదాయం కనిపించినా విత్‌డ్రాకు వీలుకాకపోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఇంగ్లీష్, హిందీ వచ్చిన వారే టార్గెట్ - సీబీఐ, ఈడీ అంటూ దోపిడీ
సైబర్ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం ఎందుకు 'గోల్డెన్ అవర్' గురించి తెలుసుకోండి