Crop Loss in Telangana Due to Heavy Rains : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో 22 జిల్లాలకు చెందిన 131మండలాల పరిధిలోని 999 గ్రామాల్లో 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. దీంతో రూ.415కోట్ల నష్టం వాటిల్లింది. అత్యధికంగా వరికి 1.80 లక్షల ఎకరాల్లో, పత్తికి 1.06 లక్షలు, మొక్కజొన్నకు 20వేలకు పైగా ఎకరాల్లో నష్టం జరిగింది.
- మిర్చి, మొక్కజొన్న, కందులు, సోయా, పెసర, మినుములు, కూరగాయలు తదితర పంటలకూ నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయశాఖ సోమవారం ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
- ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జిల్లాల్లో ఎక్కువ శాతం పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్, నారాయణపేట, భద్రాద్రి, ఆదిలాబాద్, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లోనూ నష్టం జరిగింది.
ప్రాథమిక అంచనా నివేదిక ప్రభుత్వానికి : పంటలు దెబ్బతినడంతో 85,323 మంది రైతులు నష్టాల బారిన పడ్డారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 46,374 మంది, మహబూబాబాద్ జిల్లాలో 18,089 మంది, సూర్యాపేటలో 9,227 మందికి పంట నష్టం వాటిల్లింది. ఇతర జిల్లాల్లోనూ పలువురు రైతులు బాధితులుగా మిగిలారు. వర్షాలతో పంటనష్టం ఇంకా భారీగా ఉంటుందని, అయితే వర్షపు నీరు నిండి ఉన్నందున ప్రాథమికంగా అంచనా వేసి నివేదిక ఇచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయి నివేదిక తయారైన అనంతరం నష్టం వివరాలు సమగ్రంగా తెలుస్తాయని తెలిపారు.
చీడ పురుగుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు : భారీ వర్షాల వల్ల పంటలకు జరిగిన పంట నష్టం కాకుండా నీటి నిల్వ వల్ల చీడపీడల బెడద పెరుగుతోందని దాన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచించింది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుములకు ప్రస్తుతమున్న పంట దశలో కొన్ని రకాల చీడపీడలు అధికంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దానికి ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల నష్టాల నుంచి కాపాడుకోవచ్చని వర్సిటీ పరిశోధన సంచాలకులు, రిజిస్ట్రార్ పి.రఘురామిరెడ్డి చెప్పారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం - రోడ్డెక్కి లబోదిబోమంటున్న రైతాంగం - PROTEST FOR WET PADDY PROCUREMENT