Crime Increasing in Hyderabad : హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా వరుస మర్డర్‌లు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే దాదాపు 20కి పైగా హత్యలు చోటుచేసుకోవడం పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలు, రాజకీయ వివాదాలు, వివాహేతర సంబంధాలే ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. గత సంవత్సరంలో హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో నెలకు సగటున 13 మంది హత్యకు గురి కాగా, గత నెల రోజుల్లో ఆ సంఖ్య 20ని దాటడం కలవరపెడుతోంది. క్షణికావేశంలో జరిగే మర్డర్‌లను అడ్డుకోకపోయినా, ఆధిపత్యం కోసం, పాత కక్షలతో జరిగే హత్యలను మాత్రం పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంటుంది. విస్తృత నిఘాతో వీటిని అడ్డుకోవాల్సిన ఖాకీలు, పట్టీపట్టనట్లు వ్యవహరించడంతోనే పరిస్థితులు చేయి దాటుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బెంబేలెత్తిస్తున్న రౌడీషీటర్లు - పోలీసుల నిఘా ఎక్కడ? : పోలీసుల రికార్డుల ప్రకారం నగరంలో 3 వేల మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల వీరి ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. సెటిల్‌మెంట్లు, ఆధిపత్యం కోసం జరిగే గ్యాంగ్ వార్‌లలో ప్రత్యర్థులను దారుణంగా హతమారుస్తూ సాధారణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆసిఫ్‌నగర్‌లో రౌడీ షీటర్లు ఓ వ్యక్తిని వీధుల్లో వెంటాడుతూ హతమార్చిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీసుల నిఘా వైఫల్యంతోనే రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గుప్పుమంటున్న గంజాయి : ఇటీవల కాలంలో నగరంలో మత్తు పదార్థాల వినియోగం విపరీతంగా పెరిగింది. అర్ధరాత్రిళ్లూ అడ్డగోలుగా మద్యం అమ్మకాలు, విచ్చలవిడిగా యువతకు చేరుతున్న గంజాయి, డ్రగ్స్ వంటివి నేరాలకు దారితీస్తున్నాయి. మాదక ద్రవ్యాలపై 3 కమిషనరేట్లలోనూ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, ఏదో ఒక రూపంలో అవి చేరాల్సిన చోటుకు చేరుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం, టీజీ న్యాబ్ ఈ ఏడాది ఇప్పటి వరకు 788 కేసుల్లో రూ.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా, వాటిలో సగానికి పైగా రాజధాని పరిధిలో స్వాధీనం చేసుకున్నవే ఉండం ఆందోళన కలిగిస్తోంది.
భయపెడుతోన్న బవారియా ముఠా - ఠారెత్తిస్తున్న ధార్ గ్యాంగ్ : ఓవైపు నగరంలో రౌడీషీటర్లు, ఆకతాయిలు అలజడి సృష్టిస్తుంటే, మరోవైపు నగర శివార్లలో అంతర్రాష్ట్ర ముఠాలు బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ధార్, బవారియా గ్యాంగ్‌లు, పార్దీ ముఠాలు, రాజస్థాన్‌కు చెందిన చైన్ స్నాచర్లు తమ పంజా విసురుతున్నారు. హైదరాబాద్ పోలీసుల దెబ్బకు మూడేళ్ల పాటు నగరంవైపు చూడని ధార్ గ్యాంగ్, తాజాగా హయత్‌నగర్‌లో చోరీకి పాల్పడింది. తామేమీ తక్కువ కాదన్నట్లు బవారియా గ్యాంగ్ సైతం గత నెలలో ఒకేసారి 4 గొలుసు దొంగతనాలు చేసింది. తాజాగా బోనాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా మహిళలు దేవాలయాలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో స్నాచర్లు విజృంభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో యాంటీ స్నాచింగ్ బృందాలను రంగంలోకి దింపారు.
బందోబస్తుతో అసలు సమస్య : ఎన్నికల విధులు, బందోబస్తు, వరుస బదిలీలు, పని ఒత్తిడి తదితర కారణాలతో నిఘా లోపం ఏర్పడుతోందని పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత రెండుసార్లు పోలీసుల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన అధికారులు పాత నేరస్థులెవరు? ఏయే ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతాయో గుర్తించలేకపోతున్నారు. కొందరేమో ఎలాగూ బదిలీపై వెళ్తామనే ఉద్దేశంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణా ఉంది.