CPI Ramakrishna reacted on Punganur incident: భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై వైసీపీ కార్యకర్తల దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. సదుం పోలీస్ స్టేషన్ ఎదుటే బీసీవై ప్రచార వాహనాలను ధ్వంసం చేసి తగలబెట్టడాని ఖండించారు. వైసీపీ దురాగతాలు ఈ ఘటన పరాకాష్ట అని విమర్శించారు.
బీసీవై పార్టీ నేత ఆనంద రెడ్డి ఇంటిపై వైఎస్సార్సీపీ మూకలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం దుర్మార్గమన్నారు. పుంగనూరు ఏమైనా పాకిస్తాన్లో ఉందా? అని ప్రశ్నించారు. పుంగనూరులో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. పుంగనూరు పెద్దిరెడ్డి జాగీరా? అని విమర్శించారు. పుంగనూరులో రౌడీ రాజ్యం నడుస్తుందనటానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని, దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌పై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడటం దారుణమని మచిలీపట్నం బీసీవై పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కోన నాగార్జున మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిధున్ రెడ్డి, రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి 300 మంది వైఎస్సార్సీపీ గుండాలు ఒక బీసీ నాయకుడిని చూసి భయపడుతున్నాయని తెలిపారు. పుంగనూరు ప్రజలను, తమ కార్యకర్తలను భయభ్రాంతులకు చేసే విధంగా తమ పార్టీ ప్రచార రథాలను, కారులను, రాళ్లు కర్రలతో దాడి చేసి పగలగొట్టడం సిగ్గు చేటన్నారు. రామచంద్ర యాదవ్ ప్రజలకు మేలు చేసే వ్యక్తని, అటువంటి వ్యక్తిపై దాడి చేయడం అనేది హేయమైన చర్యగా ఖండిస్తున్నామన్నారు.
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన - 3 అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సిద్ధం
దాడి జరుగుతున్న పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉండిపోయారు తప్ప శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి నుండి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలతో పెద్దిరెడ్డి అనుచరులు ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో కావాలని అలజడులు గొడవలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారని దుయ్యబట్టారు. రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తిని బాధపెడితే అన్ని వ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించి నిందితులను అరెస్టు చేసి బైండోవర్ చేయకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపారు.