Cotton Farmers Suffering Due to Lack of Price For Crop: తెల్ల బంగారం ఈ ఏడాది తెల్లబోయింది. పత్తి రైతుల ఆశలు దూది పింజాల్లా తేలిపోయాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో 10.17 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగు చేశారు. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే 34 శాతం మేర తగ్గింది. ఉత్పత్తి 27 లక్షల బేళ్ల నుంచి 12 లక్షల బేళ్లకు పరిమితమైంది. ఎకరాకు దిగుబడి మూడు, నాలుగు క్వింటాళ్లే దక్కాయి. తొలుత కరవు, ఆపై అధిక వర్షాలు, చివరకు మార్కెట్లో మద్దతు ధర దక్కక పత్తి రైతు చిత్తయ్యారు. 2018-19 సంవత్సరంలో ఎకరాకు పెట్టుబడి 25 వేలు ఉంటే ఇప్పుడు 40 వేల పైమాటే. ఎరువులు, పురుగుమందులు, డీజిల్, ఇతర సేద్య ఖర్చులు 40శాతం పెరిగాయి. నకిలీ విత్తనాలతో రైతులు నట్టేట మునుగుతున్నారు. పత్తిసాగునే నమ్ముకున్న లక్షల రైతు కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి.
రాష్ట్రంలో సగానికి తగ్గిన తెల్ల బంగారం సాగు - సహకరించని ప్రకృతి, ఆదుకోని పాలకులు
పత్తి రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ఎకరాకు వచ్చేది మూడు, నాలుగు క్వింటాళ్లయితే దాన్నీ అమ్ముకోవడానికి రైతులకు అగచాట్లు తప్పడం లేదు. మద్దతు ధరపై కొనుగోలు మొక్కుబడి చందంగానే తయారైంది. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు ధరను తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు మిగ్ జాం తుపాను ధాటికి పత్తి పంట దెబ్బతింది. కొన్నిప్రాంతాల్లో పూవు, పిందె రాలిపోయాయి. ఫలితంగా తుపాను ప్రభావం దిగుబడులపై పడింది. వచ్చేది కూలీలకు సరిపోదనే బెంగతో రైతులు తాము పెంచిన పత్తిని తమ చేతులతోనే తొలిగించేస్తున్నారు.
పతనం దిశగా తెల్ల బంగారం ధర - మార్కెట్లలో రైతులకు స్వాగతం పలుకుతున్న సమస్యలు
పంటను పొలాల్లోనే ట్రాక్టర్లు పెట్టి దున్నించేస్తున్నారు. కొందరు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు అక్కడి ప్రభుత్వాలు గతంలో సాయం అందించాయి. జగన్ ప్రభుత్వానికి ఆ ఉదారత లేకపోయింది. పెట్టుబడి రాయితీ, పంటల బీమా మంజూరుచేయడంతోపాటు వచ్చే సీజన్‌కు నాణ్యమైన విత్తనాలు అందించాలని రైతులు కోరుతున్నారు. పంట ఆఖరి దశలోనూ పత్తి రైతులు కోలుకోలేదు. చివరి తీతకూ కాలం కలిసిరాలేదు. పత్తి సాగుకాలం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉండగా ఈ ఏడాది జనవరి చివరి, ఫిబ్రవరి మొదటి వారంలోనే చాలామంది రైతులు పంట కాలాన్ని ముగించారు.
సాగు తగ్గినా.. వృద్ధి పెరుగుతుందా..? ఈ లెక్కలెంటో..
ప్రభుత్వపరంగా గిట్టుబాటు ధర దక్కకపోవడంతోపాటు గులాబీరంగు పురుగు తాకిడి, తగ్గిన పంట దిగుబడులు పత్తి రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. చివరి తీత కోసం ఎదురుచూసే రైతులు విసిగిపోయి కాయలతో సహా తమ పంటను ట్రాక్టర్లు పెట్టి పెకిలించేశారు. కొన్నిచోట్ల ఇప్పటికీ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నివిధాలా నష్టపోయిన పత్తిరైతులను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముంది. ఇన్ ఫుట్స్ సబ్సిడీ, పంటల భీమా మంజూరుచేయడంతోపాటు వచ్చే సీజన్ కు సిద్ధమవుతున్న రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన భాధ్యత రాష్ట్రప్రభుత్వానిపై ఉందని రైతులు చెబుతున్నారు. లేకుంటే పత్తి పంట సాగుకు రైతులు క్రమంగా దూరమయ్యే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.