Amit Shah Video Morphing Case Update : దిల్లీలో నమోదైన ఎఫ్ఐఆర్లో దర్యాప్తు పేరుతో టీపీసీసీ సామాజిక మాద్యమం కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు పేరుతో సామాజిక మాధ్యమం కార్యదర్శుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడాన్ని సవాలు చేస్తూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పిటిషన్లో తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ విజయాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు తెలిపారు. అయితే దిల్లీ పోలీసులమంటూ 150 మంది దాకా వచ్చి ఇక్కడ సామాజిక మాధ్యమం కార్యదర్శుల పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మార్ఫింగ్ వీడియోలను పోస్టు చేశారంటూ ప్రభుత్వ ఉద్యోగి శింకు శరణ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చి పార్టీకి చెందినవారిని, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోర్టుకు వివరించారు. దీంతో పాటు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఫిర్యాదు చేశారన్నారు.
'కేంద్ర హోంమంత్రి రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రసంగించారంటూ వక్రీకరించి వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణలతో మా నేతలపై ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా కొంత మందిని మే 3న కొందరు నేతలను అరెస్టు చేశారు. వారిలో కొంత మంది బెయిల్పై విడుదలయ్యారు. ఒకే రకమైన కేసుకు సంబంధించి అక్రమంగా నిర్భంధించాలని చూస్తున్నారు. ఎన్నికల వేళ ప్రచారం సజావుగా సాగకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.' అని కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
Amit Shah Fake Video Case : మణికొండలోని కాంగ్రెస్ కన్సల్టెంట్గా ఉన్న మంద శ్రీప్రతాప్ ప్లాట్లోని 15 నుంచి 20 మంది సొంత వస్తువులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేశారు. ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దిల్లీ పోలీసులు అక్రమంగా ఇళ్లలోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సాక్షులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దర్యాప్తు పేరుతో నిర్బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్యాప్తు పేరుతో కఠిన చర్యలు తీసుకోకుండా, అదే విధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలి. అంటూ కాంగ్రెస్ తన పిటిషన్లో పేర్కొంది. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర హోంశాఖ, డీజీపీ, పోలీసు కమిషనర్, దిల్లీ ఎస్ఏహెచ్, ప్రభుత్వ ఉద్యోగులను చేర్చారు. ఈ పిటిషన్పై నేడు వేసవి సెలవుల హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు - కీలక విషయాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ
అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురి అరెస్ట్ - కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం