Telangana Land Market Value Hike : తెలంగాణలో భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువలు పెంచాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలోనే ఉండాలని స్పష్టం చేసింది. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఇందులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ జ్యోతి బుద్ద ప్రకాశ్‌లతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
2023-24లో రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన రాబడులు, 2024-25 ఆర్థిక ఏడాదిలో నిర్దేశించిన లక్ష్యం, ఇప్పటి వరకు వచ్చిన రాబడులు, ఇదే క్రమంలో ఆదాయం వస్తే ఈ ఆర్థిక ఏడాది ఎంత వచ్చే అవకాశం ఉందన్నదానిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పుడు వస్తున్న రాబడులు ఇలాగే వస్తే నిర్దేశించిన లక్ష్యం చేరుకునే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా గడిచిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో భూముల మార్కెట్ ధరలను రెండు సార్లు పెంచినట్లు వివరించారు.
శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఉజ్జాయింపుగా పెంచడం వల్ల కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్ ధర కంటే రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలల్లో రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మార్కెట్ విలువలు, వ్యాపార ఒప్పంద పత్రాలపై వసూలు చేస్తున్న స్టాంపు డ్యూటీ తదితర అంశాలపై అనుసరిస్తున్న విధానాలను కూడా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
70 శాతానికిపైగా ఆ జిల్లాల నుంచే ఆదాయం : తెలంగాణాలో రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న ఆదాయంలో 70 శాతానికిపైగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధి నుంచేనని అధికారులు తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లో ఇప్పుడున్న బహిరంగ మార్కెట్ ధరలు, అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ ధరలు బేరీజు వేసి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లల్లో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తున్నవారిలో ఎక్కువ భాగం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉండడంతో నిర్దేశించిన రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ కంటే ఎక్కువ విలువకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నవి యాభైశాతం వరకు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
ఇక వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలకు జరుగుతున్న రిజిస్ట్రేషన్లల్లో 80 శాతం నిర్దేశించిన మార్కెట్ ధరలకే చేయించుకుంటుండగా మరో 20 శాతం మాత్రం అధిక ధరలకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇలా మార్కెట్ విలువల కంటే ఎక్కువకు రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి కొంత రాయితీ ఇచ్చేందుకు చొరవ చూపితే ప్రోత్సహించినట్లుందని అధికారులు సూచించగా ప్రతిపాదించాలని మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. మార్కెట్ విలువలను శాస్త్రీయ పద్దతిలో పెంచితే దాదాపు రూ. 4వేల కోట్లు అదనపు రాబడి వస్తుందని అంచనాలను మంత్రికి వివరించారు.
ఆదాయం వచ్చేలా చట్టాన్ని కూడా సవరించేందుకు ప్రతిపాదనలు : అయితే రెవెన్యూ శాఖ మంత్రి జోక్యం చేసుకుని రంగారెడ్డి, జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో అక్కడున్న బహిరంగ మార్కెట్ ధరలు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వ్యవసాయ భూముల బహిరంగ మార్కెట్ విలువలు, అక్కడ రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువలను ఉదాహరణలతో మంత్రి అధికారులతో తెలుసుకున్నారు. అన్ని విన్న తరువాత సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా వాస్తవ పరిస్థితులకు దగ్గరగా మార్కెట్ విలువలు పెంపు ఉండేట్లు చూడాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
అదేవిధంగా మార్కెట్ విలువలు పెంచుతున్నందున ఇప్పుడున్న స్టాంపు డ్యూటీ కొంత తగ్గిస్తే ఆ ప్రభావం రాబడి మీద పడుతుందా అన్నదానిపై కూడా అధికారులతో ఆరా తీసినట్లు తెలుస్తోంది. హైరేంజి భవనాలల్లో నిర్దేశించిన అంతస్తులు దాటితే బిల్డర్లు అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నందున పెంచే సమయంలో వాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. సూక్ష్మస్థాయిలో అధ్యయనం జరగాలని అవసరమైతే ప్రైవేటు కన్సల్టెంట్లతో సంప్రదించి అయినా విమర్శలకు తావులేకుండా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను మంత్రి ఆదేశించారు. అదనపు ఆదాయం సమకూర్చుకోడానికి అవసరమైతే చట్టాన్ని కూడా సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపు! - ఎంత శాతం అంటే? - Land Market Value in Telangana